బ్రిక్స్ దేశాల కూటమి కీలక నిర్ణయం దిశగా చర్చలు సాగిస్తోంది. దక్షిణాఫ్రికాలోని జోహెనెస్‌బర్గ్‌లో జరుగుతోన్న 15వ బ్రిక్స్ దేశాల కూటమి సభ్యులు కొత్త దేశాలకు సభ్యత్వం ఇచ్చే అంశంపై చర్చించారు. ఇందుకు భారత్ చొరవ చూపింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాల నాయకులు చర్చలు జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న పరిణామాలపై బ్రిక్స్ నాయకులు మంగళవారం నాడు చర్చించారు.
జోహెనెస్బర్గ్లోని శాండ్టన్ సన్ హోటల్ వద్ద ప్రధాని మోదీకి స్థానిక భారతీయులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ప్రధాని పదవి చేపట్టాక మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటించడం ఇది మూడోసారి. మంగళవారం మొదటి రోజు బిజినెస్ ఫోరమ్ సమావేశం నిర్వహించారు. భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సమావేశాల ద్వారా ఇరు దేశాల మధ్య నమ్మకం పెంచుకోవడం, పారదర్శక విధానాలు పాటించడంలాంటి అంశాలు ప్రపంచ దక్షిణ దేశాల్లో ప్రభావం చూపుతాయన్నారు.
దక్షిణాఫ్రికాలో శ్రామిక శక్తిని ఉపయోగించుకుని బ్రిక్స్ కూటమిలోని దేశాలు దక్షిణాఫ్రికా ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా పిలుపు నిచ్చారు. దక్షిణాఫ్రికాలో డిజిటల్ నిపుణులైన పట్టణ యువత అందుబాటులో ఉందని, ఇది కంపెనీలకు భవిష్యత్తులో స్థిరమైన శ్రామిక శక్తినందిస్తుందని రామాఫోసా పేర్కొన్నారు.
ఈ సమావేశాలకు ప్రధాని మోదీ సహా బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా విదేశాంగ మంత్రి సర్గెయ్ లావ్రోవ్ హాజరయ్యారు. దక్షిణాఫ్రికా బ్రిక్స్ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు