భారత అంతరిక్ష
పరిశోధనా సంస్థ ఇస్రో, చంద్రుడి రహస్యాలను వెలికి తీయడానికి చేపట్టిన లూనార్
మిషన్‌లో తాజా ప్రయోగం చంద్రయాన్ 3. ఈ వ్యోమనౌకలో ‘విక్రమ్’ అనే ల్యాండర్, ‘ప్రజ్ఞాన్’ అనే రోవర్ ఉన్నాయి. ఇందులో
ప్రొపల్షన్ మోడ్యూలే ఆర్బిటర్‌గా పనిచేస్తుంది.
చంద్రయాన్
3 ప్రయోగం 2023 జులై 14న మొదలైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
నుంచి ఎల్విఎం3 ఎం4 రాకెట్ ద్వారా ఈ స్పేస్ ప్రోబ్ ప్రస్థానం మొదలైంది. భూమికి
చంద్రుడు దగ్గరగా ఉండే సమయాన్ని లెక్క కట్టి ఇస్రో ఈ ప్రయోగాన్ని జులై నెలలో
చేపట్టింది.
వ్యోమనౌక
ఆగస్ట్ 5న చంద్రకక్ష్యలోకి ప్రవేశించింది. నౌక నుంచి విక్రమ్ ల్యాండర్ ఆగస్ట్ 17న
విడివడింది. ప్రొపల్షన్ మోడ్యూల్ నుంచి విడిపోయి చంద్రుడి ఉపరితలం మీదకు ఒంటరి
ప్రయాణం మొదలుపెట్టింది.
చంద్రయాన్
3 ప్రాజెక్ట్‌లో ల్యాండర్లో 3 పేలోడ్లు, రోవర్లో 2, ప్రొపల్షన్ మోడ్యూల్‌లో ఒక
పేలోడ్ ఉన్నాయి.
ఈ
ప్రయోగంలో ఇస్రో మూడు లక్ష్యాలు నిర్దేశించుకుంది.
(1) చంద్రుడి ఉపరితలం మీద ల్యాండర్‌ను
సాఫీగా, సురక్షితంగా ల్యాండ్ చేయడం
(2) రోవర్ పనితీరును పరిశీలించడం, దాని
సంచారాన్ని నిర్దేశించడం
(3) చంద్రుడి ఉపరితలాన్ని అర్ధం చేసుకోవడం
కోసం, అక్కడ ఏ పదార్ధాలు లభ్యమవుతాయో తెలుసుకోవడం కోసం ప్రయోగాలు చేయడం.
ఇప్పటివరకూ
ఏ దేశమూ చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు కన్నెత్తి చూడలేకపోయాయి. అదే లక్ష్యంగా
కొద్దిరోజుల క్రితం రష్యా ప్రయోగించిన లూనా 25, ఆఖరి దశలో కుప్పకూలి పోయింది.
అయితే, చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న భారతీయ శాస్త్రవేత్తలు
చంద్రయాన్ 3లో ఎలాంటి పొరపాట్లూ జరక్కుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అవన్నీ
ఫలించి, ప్రయోగం విజయవంతమైతే, అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కీర్తి పతాక రెపరెపలను
అడ్డుకోగలిగిన వారే ఉండరు.