చంద్రయాన్ 1
విజయవంతం అవడంతో భారత శాస్త్రసమాజంలో ఉత్సాహం ఉరకలెత్తింది. కానీ, రెండో ప్రయోగానికి
దశాబ్దకాలం విరామం వచ్చింది. చంద్ర ఉపరితలం మీద మారుతుండే స్థితిగతులను అధ్యయనం
చేయడం, చంద్రుడి మీద నీటిజాడలు సమృద్ధిగా ఎక్కడున్నాయో కనుగొనడం ఈ రెండో ప్రయోగం ప్రధాన
లక్ష్యాలు. దురదృష్టవశాత్తూ ప్రయోగం విఫలమవడంతో ఆ లక్ష్యాలను అందుకోలేకపోయాం.
చంద్రయాన్ 2లో
ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు విభాగాలున్నాయి. ల్యాండర్‌కు ప్రఖ్యాత భారతీయ
శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ పేరు మీద ‘విక్రమ్’ అని నామకరణం చేసారు. అలాగే,
చంద్ర ఉపరితలం మీద తిరుగుతూ సమాచారం సేకరించే రోవర్‌కు ‘ప్రజ్ఞాన్’ అని పేరు పెట్టారు. 2019 జులై 22న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
నుంచి ఎల్విఎం3 ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్‌ను ప్రయోగించారు.
ఈ
స్పేస్‌క్రాఫ్ట్ 2019 ఆగస్ట్ 20న చంద్రకక్ష్యలోకి చేరుకుంది. విక్రమ్ ల్యాండర్‌ను
చంద్ర ఉపరితలం మీద దింపడానికి ఆర్బిటల్ పొజిషనింగ్ మానోవర్స్ మొదలుపెట్టింది.
చంద్రుడు భూమికి చేరువగా ఉండే వైపు ల్యాండర్, రోవర్ దిగడానికి అన్ని ఏర్పాట్లూ
చేసారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే సెప్టెంబర్ 6న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో
ల్యాండర్, రోవర్ అడుగు పెట్టి ఉండాలి. అయితే, చంద్రతలం మీద అడుగుపెట్టే ప్రయత్నంలో
ల్యాండర్ దాని మార్గాన్ని అతిక్రమించి ప్రయాణం చేయడం వల్ల రోదసిలోనే క్రాష్
అయిపోయింది. ఈ వైఫల్యాన్ని అధ్యయనం చేసిన ఇస్రో, సాఫ్ట్వేర్ లోపం వల్లనే
ల్యాండర్ కుప్పకూలిందని నిర్ధారించింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటేఈ
ల్యాండర్‌ను తొలుత అభివృద్ధి చేసింది భారతదేశం కాదు. 2007 నవంబర్ 12న భారత్‌కు చెందిన ఇస్రో,
రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్ పరిశోధనా సంస్థలు చంద్రయాన్2 కోసం కలిసి పనిచేయాలని
ఒప్పందం చేసుకున్నాయి. ఆర్బిటర్, రోవర్ల బాధ్యత ఇస్రోది. అలాగే భారత్‌కు చెందిన
జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా వ్యోమనౌకను ప్రయోగించడానికి నిర్ణయించుకున్నారు.
ల్యాండర్‌ను మాత్రం రష్యా అందజేయడానికి ఒప్పందం కుదిరింది. చంద్రయాన్ మిషన్‌కు
భారత ప్రభుత్వం 2008 సెప్టెంబర్ 18న ఆమోదముద్ర వేసింది.
స్పేస్‌క్రాఫ్ట్ డిజైనింగ్ 2009 ఆగస్ట్
నాటికి పూర్తయింది. ఇరుదేశాల శాస్త్రవేత్తలూ కలిసి ప్రాజెక్ట్‌ను సమీక్షించారు. చంద్రయాన్2లో
ఉండాల్సిన పేలోడ్‌ను ఇస్రో సరైన సమయానికే ఖరారు చేసేసింది. అయినప్పటికీ 2013
జనవరిలో జరగాల్సిన చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదా పడింది. 2016కు రీషెడ్యూల్ అయింది.
దానికి కారణం, రష్యా తాను అందిస్తానని ఒప్పుకున్న ల్యాండర్‌ను పూర్తిగా డెవలప్
చేయలేకపోవడమే.ఆ సమయంలో, అంగారక గ్రహంపైన పరిశోధనలకు రష్యా ప్రయోగించిన ఫోబోస్
గ్రంట్ మిషన్ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల విఫలమైంది. అవే సాంకేతికతలను రష్యా తమ
లూనార్ ప్రాజెక్టులలో కూడా వినియోగిస్తోంది. వాటిలో మన చంద్రయాన్2లోని ల్యాండర్
కూడా ఒకటి. ఆ కారణంగా ల్యాండర్ డిజైన్‌ను రష్యా మరోసారి సమీక్షించవలసి వచ్చింది.
ల్యాండర్‌ను సమీక్షించిన రాస్‌కాస్మోస్,
దాని బరువును పెంచక తప్పదని స్పష్టం చేసింది. ఫలితంగా ఇస్రో తన రోవర్ బరువును
తగ్గించాల్సి వచ్చింది. అంతేకాదు, విశ్వసనీయత పరీక్షలోనూ కొన్ని రిస్కులను
స్వీకరించక తప్పలేదు. అయినప్పటికీ రష్యా 2015 నాటికి కూడా ల్యాండర్‌ను
ఇవ్వలేకపోయింది. ఆ దశలో మన దేశం మన లూనార్ మిషన్‌ను సొంతంగానే డెవలప్ చేసుకోడం
ఉత్తమమని నిర్ణయించుకుంది. చంద్రయాన్ 2 ప్రయోగ కాలాన్ని మార్చుకుంది. అక్కడ
వాడకుండా వదిలిపెట్టిన ఆర్బిటర్ హార్డ్‌వేర్‌ని 2013లో చేపట్టిన మార్స్ ఆర్బిటర్
మిషన్‌లో భారత్ వినియోగించుకుంది.
అలాంటి పలు కారణాల వల్ల చంద్రయాన్ 2
ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు 2019 జులై 22న జిఎస్ఎల్వి ఎంకె3 ఎం1
రాకెట్ ద్వారా చంద్రయాన్ ప్రయోగం జరిగింది.
చంద్రయాన్2 ల్యాండర్
ప్రధాన లక్ష్యాలు ఏంటంటే చంద్రుడి ఉపరితలం మీద
సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి తగిన సామర్థ్యం ఉందని చూపడం, చంద్రుడి ఉపరితలం మీద
రోబోటిక్ రోవర్‌ను ఆపరేట్ చేయడం.
ఇంక ఆర్బిటర్ లక్ష్యాలు
ఏంటంటే…
చంద్రతలం నైసర్గిక
స్వరూపాన్ని, అక్కడి ఖనిజ సంపదను, మూలకాల లభ్యతను అధ్యయనం చేయడం
చంద్రుడి మీద నీరు, మంచు ఉనికిని
కనుగొనడం
చంద్రుడి దక్షిణ ధ్రువ
ప్రాంతంలో నీరు, మంచు ఉనికిని అధ్యయనం చేయడం,
చంద్రుడి ఉపరితలాన్ని
మ్యాపింగ్ చేసి, 3డి మ్యాప్స్ తయారీకి సహకరించడం.
చంద్రయాన్2 పేలోడ్ విషయానికి
వస్తే, ఆర్బిటర్‌కు సంబంధించిన 8 పరికరాలు, ల్యాండర్‌కు సంబంధించిన 4 పరికరాలు,
రోవర్‌కు సంబంధించిన 2 పరికరాలు ఉన్నాయి.
ఈ ప్రయోగం విక్రమ్ ల్యాండర్ నష్టం
కారణంగా విఫలమయింది. విక్రమ్ ల్యాండర్ 2019 సెప్టెంబర్ 6న చంద్రుడి ఉపరితలం మీద నిర్దేశిత
స్థలంలో దిగాల్సి ఉంది. అయితే ఫైనల్ వెర్టికల్ వెలాసిటీని నియంత్రించుకోలేకపోయింది.
చంద్ర ఉపరితలం మీద జాగ్రత్తగా దిగడానికి ఉండాల్సిన వేగం కంటె ఎక్కువ వేగంతో
ల్యాండర్ దిగిందని నిపుణులు అంచనా వేసారు. ఆ ‘హార్డ్ ల్యాండింగ్’ ఫలితంగా విక్రమ్
క్రాష్ అయిపోయింది. ఆ ల్యాండర్ ఆచూకీని కనుగొనడానికి ఇస్రో, నాసా చేసిన
ప్రయత్నాలేవీ ఫలించలేదు.
చంద్రయాన్2 ప్రాజెక్ట్‌లో
ల్యాండర్ విఫలమైనప్పటికీ, ఆర్బిటర్ మాత్రం పనిచేస్తూనే ఉండడం భారత శాస్త్రవేత్తలకు
కొద్దిపాటి ఊరట. చంద్రుణ్ణి అధ్యయనం చేయడానికి 7 సంవత్సరాలు పనిచేసేలా ఆర్బిటర్‌ను
రూపొందించారు. అది ఇంకా పనిచేస్తూనే ఉంది.