జాబిలిని అందుకునే క్రమంలో
భారత్ ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం చంద్రయాన్1. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
ఇస్రో దీన్ని 2008 అక్టోబర్‌లో లాంచ్ చేసింది. ఈ లూనార్ ప్రోబ్ ఆగస్టు 2009 వరకూ
పనిచేసింది. ఈ మిషన్‌లో ఒక ఆర్బిటర్, ఒక మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఉన్నాయి. ఇస్రో ఈ
స్పేస్‌క్రాఫ్ట్‌ను పీఎస్ఎల్వీ ఎక్స్ ఎల్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు
పంపించింది.
ఈ ప్రయోగం భారత
అంతరిక్ష ప్రయోగాల్లో ఒక కొత్త మేలిమలుపుగా నిలిచింది. చంద్రుడి అన్వేషణకు కావలసిన
సాంకేతికత అంతటినీ ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. పీఎస్ఎల్వీ రాకెట్ 22
అక్టోబర్ 2008న లూనార్ ప్రోబ్‌ను తీసుకుని, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్
సెంటర్ నుంచి బయల్దేరింది. ఆ రాకెట్ 2008 నవంబర్ 8న చంద్ర కక్ష్యలోకి చేరుకుంది.
చంద్రయాన్ ఆర్బిటర్
లోనుంచి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ 2008 నవంబర్ 14న విడిపోయింది. అది నియంత్రిత విధానంలో
చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకింది. ఈ ప్రయోగంతో, చంద్ర ఉపరితలాన్ని చేరుకున్న
ఐదవ దేశంగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ ఘనతను సోవియట్ యూనియన్, అమెరికా, జపాన్,
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మాత్రమే సాధించాయి. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుణ్ణి
తాకిన ప్రదేశానికి జవహర్ పాయింట్ అని పేరు పెట్టారు.
చంద్రయాన్ 1
ప్రయోగం సఫలమైందనే చెప్పాలి. ఈ ప్రయోగానికి రూ.386 కోట్లు ఖర్చయింది. చంద్రతలాన్ని
సర్వే చేయాలన్న ప్రధాన ఉద్దేశం దాదాపు పూర్తిగా నెరవేరింది. చంద్రుడి మీద ఉన్న
రసాయనాల వివరాలను కనుగొనడం అన్న లక్ష్యాన్ని ఈ ప్రోబ్ పూర్తి చేసింది. ప్రధానంగా,
చంద్రతలం మీద నీటి జాడలు ఉన్నాయని కనుగొంది. ఇది జాబిలి మీద ప్రపంచ దేశాలు చేసిన
ప్రయోగాల్లో అంతవరకూ తెలియని విషయం.
చంద్రయాన్ 1 లాంచ్
సమయంలో దాని బరువు 1380 కేజీలు. చంద్రకక్ష్యలోకి చేరేసరికి దాని బరువు 675 కేజీలకు
తగ్గిపోయింది. ఇంపాక్టర్ని చంద్రుడి మీదకు విడుదల చేసేసిన తర్వాత ఆ బరువు 523
కేజీలకు తగ్గింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ప్రధానంగా సౌరశక్తి ఆధారంగా పనిచేసింది.
ఈ వ్యోమనౌకలో
పేలోడ్ బరువు 90 కేజీలు. అందులో 5 భారతీయ పరికరాలు, 6 ఇతర దేశాల పరికరాలూ
పంపించారు. భారతదేశం పంపించిన పరికరాలు… టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా, హైపర్
స్పెక్ట్రల్ ఇమేజర్ కెమెరా, లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్, హై ఎనర్జీ
ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. ఈ పరికరాల్లో చివరిదైన మూన్
ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడి మీద దక్షిణ ధ్రువ ప్రాంతం మీద 2008 నవంబర్ 14న దిగింది.
చంద్రకక్ష్యలోనుంచి చంద్రుడి ఉపరితలం మీదకు క్షేమంగా చేరుకోడానికి ఈ ప్రోబ్ దాదాపు
అరగంట సమయం తీసుకుంది.
సుమారు ఏడాది కాలం
పనిచేసాక చంద్రయాన్ 1 లూనార్ ప్రోబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం మొదలయింది.
స్టార్ ట్రాకర్ పనిచేయడం మానేసింది. థర్మల్ షీల్డింగ్ తగ్గిపోయింది. 2009 ఆగస్టు
29న ‘చంద్రయాన్ 1 మిషన్ పూర్తయింది’ అని ఇస్రో ప్రకటించిన కొద్దిసేపటికి, దాన్నుంచి
సమాచారం రావడం ఆగిపోయింది. చంద్రయాన్ 1 మొత్తంగా 312 రోజులు పనిచేసింది. నిజానికి
ఇది రెండేళ్ళ లక్షిత కాలంతో పోలిస్తే తక్కువే. కానీ, అప్పటికే చంద్రయాన్ 1 దానికి
అప్పగించిన శాస్త్రీయ లక్ష్యాలను పూర్తి చేయగలిగింది.