చల్లని వెన్నెలలు
పంచే జాబిల్లిని చేరుకోవాలన్న ఆశ లేనిది ఎవరికి? చందమామ చల్లగా మెల్లగా చెప్పే
రహస్యాలను అందిపుచ్చుకోవాలన్న కోరిక లేనిది ఎవరికి? అందుకే చంద్రుడి మీద
ప్రయోగాలకు భారత్ సిద్ధమయింది. ఆ ప్రాజెక్టును చేపడతామని మాజీ ప్రధానమంత్రి అటల్
బిహారీ వాజ్పేయీ మొదటిసారి 2003లో ప్రకటించడానికి నాలుగేళ్ళ ముందుగా ఈ కసరత్తు
ప్రారంభమయింది.
1999లో ఇండియన్
అకాడెమీ ఆఫ్ సైన్సెస్ సమావేశం సందర్భంగా మన దేశం చంద్రుడి మీద ప్రయోగాలు
చేపట్టాలన్న ప్రతిపాదన మొట్టమొదటిసారి వచ్చింది. ఆ ఆలోచనను ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2000
సంవత్సరంలో ముందుకు తీసుకెళ్ళింది. అనతికాలంలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
ఇస్రో, నేషనల్ లూనార్ మిషన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. చందమామ మీదకు
మానవులను పంపించగల శాస్త్రీయ పరిజ్ఞానం మన దేశానికి ఉందని ఆ టాస్క్ఫోర్స్
ధ్రువీకరించింది. ఇక ఆ దిశగా ప్రయత్నాలు సాగాయి. 2003 ఆగస్ట్ 15న ఎర్రకోట మీద
నుంచి జెండా ఎగరేసాక, చంద్రయాన్ ప్రాజెక్టు గురించి నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ తన స్వాతంత్ర్యదిన సందేశంలో ప్రకటించారు.
2003 ఏప్రిల్లో
వివిధ పరిశోధనా రంగాలకు చెందిన వందమందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు
సమావేశమయ్యారు. వారిలో ప్లానెటరీ సైంటిస్టులు, స్పేస్ సైంటిస్టులున్నారు. ఇంకా… ఎర్త్
సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్, ఇంజనీరింగ్,
కమ్యూనికేషన్ సైన్సెస్ వంటి రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు ఉన్నారు.వారందరూ సుదీర్ఘంగా, విస్తృతంగా చర్చించారు. చంద్రుడి మీదకు భారతదేశం ఉపగ్రహాన్నిప్రయోగించాలంటూ
టాస్క్ఫోర్స్ చేసిన సిఫార్సును ఆమోదించారు. ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ 2003లో
భారత ప్రభుత్వం ఆ ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది.
లూనార్ మిషన్
ద్వారా ఏం సాధించాలి అని, భారత శాస్త్ర ప్రపంచం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది.
అవేంటంటే…
(అ) చంద్రుణ్ణి
చేరగల వ్యోమనౌకకు రూపకల్పన చేయడం, దాన్ని అభివృద్ధి చేయడం, దేశీయమైన లాంచ్
వెహికిల్ ద్వారా ప్రయోగించడం, చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేలా చేయడం
(ఆ) వ్యోమనౌక
ద్వారా కొన్నిపరికరాలను చంద్రుడి మీదకు పంపడం. వాటి ద్వారా సమాచారం సేకరించి
కొన్ని ప్రయోగాలు చేయడం.
ఆ ప్రయోగాలు ఏంటంటే…
(1) చందమామ రెండువైపులా ఉపరితలం భౌగోళిక వివరాలు
సేకరించి ఒక 3డీ అట్లాస్ తయారు చేయడం
(2) చంద్రతలం మీదున్న రసాయనాలు, ఖనిజ లవణాలను
మ్యాపింగ్ చేయడం. ప్రత్యేకించి మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం,
ఇనుము, టైటానియం, రాడాన్, యురేనియం, థోరియం వివరాలను సేకరించడం
(ఇ) భవిష్యత్తులో
చంద్రుడి మీదకు ఉపగ్రహాలు ఏ ఇబ్బందులూ లేకుండా సాఫ్ట్ ల్యాండ్ అవడానికి వీలుగా ఒక
మినీ ఉపగ్రహాన్ని (మూన్ ఇంపాక్ట్ ప్రోబ్) ప్రయోగించడం
అక్కడినుంచీ చందమామను
అందుకునేందుకు మన దేశం ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.