చందమామ రావె జాబిల్లి
రావె అనే పాట తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో. మానవజాతి
ఉద్భవించినప్పటినుంచీ మనిషి మొట్టమొదట చూసింది సూర్య చంద్రులనే. ఆకాశంలోనుంచి
పడిపోకుండా మనకు కావలసిన వెలుగును ప్రసాదిస్తున్న సూర్యచంద్రులను దేవతలుగా భావించి
పూజించడం సంప్రదాయంగా నిలిచిపోయింది.
ఎన్నో తరాలు
మారాయి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కింది. రోదసి రహస్యాలు శోధించడానికి మానవుడు
ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. బుద్ధిజీవి అయిన మనిషి భూమిని దాటి
అంతరిక్షంలోకి వెళ్ళాడు. సౌరమండలంలోని గ్రహాలపై పరిశోధనలూ చేస్తున్నాడు. ఆ ఊపులోనే,
మన భూమి చుట్టూ తిరుగుతూ మనకు సిరివెన్నెలలు పంచిపెట్టే చందమామ కథ తెలుసుకోవాలని ప్రయత్నాలు
చేస్తున్నాడు.
అంతరిక్ష
పరిశోధనల్లో అగ్రరాజ్యాలకు దీటుగా నిలిచిన దేశం భారతదేశం. అమెరికా, రష్యా, చైనా,
ఫ్రాన్స్, జపాన్ వంటి అతికొద్ది దేశాలు సాధించిన రోదసీ విజయాలను దాటి, అభివృద్ధి
చెందిన దేశాల కంటె మేటిగా ప్రయోగాలు చేస్తున్న ఘనచరిత మనది. ఆ క్రమంలోనే చందమామ
రహస్యాలు తెలుసుకోడానికి భారతీయమైన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఇతర
దేశాలతో పోలిస్తే ఇప్పటికీ వర్ధమాన దేశంగానే ఉన్న భారత్‌కు ఆర్థిక పరిమితులు
ఎక్కువ. ఉన్న వనరులను ప్రజల తక్షణ అవసరాలకు వాడేయాలి తప్ప పరిశోధనలకు పెట్టకూడదంటూ
వెనక్కు లాగే సందేహజీవులకు కొదవ లేదు. అలాంటి ఎన్నో రకాల ప్రతికూలతలను ఎదుర్కొని
అంతరిక్ష పరిశోధనా రంగంలో తనదైన, చిరకాలం నిలిచిపోయే ముద్ర వేసిన ఘనత మన దేశానిది.
అందుకే, చందమామను అందుకోవాలన్న లక్ష్యాన్ని మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో
నిర్దేశించుకున్నప్పుడు బైటదేశాల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, భారతీయ ప్రజలు
మాత్రం నిండుగుండెలతో స్వాగతించారు.
చందమామ
మీద పరిస్థితులు, స్థితిగతులను తెలుసుకోడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో
చేపట్టిన ప్రయోగాల పరంపరే ‘చంద్రయాన్’ ప్రాజెక్టు. ఇది ఒక బహుళ లక్ష్యాల
కార్యక్రమం. ఇప్పటికి ఒక దశ పూర్తి చేసుకుని రెండో దశలో విజయం సాధించే దిశగా
సాగుతోంది. మొదటి దశలో ఆర్బిటర్, ఇంప్యాక్టర్లను జాబిల్లి మీదకు ప్రయోగించారు.
రెండో
దశలో సాఫ్ట్ ల్యాండర్స్, రోవర్స్‌ను చందమామ మీదకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ దశలో మొదటి ప్రయోగంలో ల్యాండర్ ప్రయోగం విఫలమైనా, మొక్కవోని పట్టుదలతో రెండో
ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ జరుగుతున్నది ఆ రెండో ప్రయోగమే.
ఈ
రెండు దశలూ పూర్తయాక, మూడో దశలో చంద్రుడి మీద నుంచి నమూనాలు సేకరించి, వాటిపై
పరిశోధనలు చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ఆ దశ కోసం భారత్, జపాన్‌తో కలిసి పని
చేయనుంది. చందమామ మీద మువ్వన్నెల పతాకం రెపరెపలాడే తరుణం ఇంకెంతో దూరం లేదు.