స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 150వ జయంతి నేడు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన ధైర్యం, తెగువ నిరుపమానం. సైమన్ గో బ్యాక్ అంటూ మద్రాసులో బ్రిటిష్ వారిని ఎదురించిన ధీరుడు ప్రకాశం పంతులుగారు. సైమన్ గో బ్యాక్ అంటూ భారతీయులు చేపట్టిన నిరసనలో బ్రిటిష్ సైనికులు తుపాకీ ఎక్కుపెట్టినా తన గుండెను చూపించి కాల్చండంటూ సవాల్ విసిరిన ప్రకాశం తెగువ చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఆయన ఆంధ్ర కేసరిగా గుర్తింపు పొందారు. ప్రమాదాలున్నచోటే ప్రకాశం ఉంటారంటూ భోగరాజు పట్టాభిసీతారామయ్య వంటి ఉద్దండులు వ్యాఖ్యానించారంటేనే ప్రకాశం తెగువను అర్థంచేసుకోవచ్చు.
1872 ఆగష్టు 23, ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో జన్మించిన టంగుటూరి ప్రకాశం జీవితాన్ని స్వాతంత్ర్య ఉద్యమానికి అంకితం చేశారు. ఆ రోజుల్లోనే రోజుకు లక్షల్లో సంపాదించే స్థాయి ఉన్న ప్లీడర్లలో ఒకరు ప్రకాశం. ఆయన కేసు తీసుకున్నారంటే గెలిచి తీరాల్సిందే. న్యాయశాస్త్రంపై ప్రకాశంకు ఉన్న పట్టు, వాదనాపటిమ, సమయస్ఫూర్తి ఇవన్నీ ఆయనను ప్రఖ్యాత న్యాయవాదిగా నిలిపాయి. ఓ వైపు మద్రాసు హైకోర్టులో కేసులు వాదిస్తూనే స్వాతంత్ర్య ఉద్యమంలో తీరిక లేకుండా గడిపారు. స్వరాజ్యం కోసం పోరాటం చేస్తూనే స్వరాజ్య పత్రిక కోసం ఆయన యావదాస్తి ధారపోశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన సర్వస్వం కోల్పోయినా గుండె ధైర్యం మాత్రం చెక్కు చెదరలేదు.
మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రకాశం, 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలి ముఖ్యమంత్రిగా కొద్ది కాలం సేవలు అందించారు. ఆయన కాలంలోనే ప్రకాశం బ్యారేజీ పునర్నిర్మాణం చేశారు. అందుకే ఆయన పేరు ఆ బ్యారేజీకి స్థిరపడిపోయింది. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతోపాటు, సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు తీయించారు ప్రకాశం.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో బయటకు వచ్చి 1951లో ప్రజాపార్టీ స్థాపించారు ప్రకాశం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మంత్రులందరినీ ఓడించారు. అయితే ప్రజాపార్టీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ దక్కలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బలనిరూపణకు ముందే ప్రభుత్వం కూలిపోయింది. ఏది ప్రజా హితమో ప్రకాశం దానికోసమే పోరాడే వారు. జమిందారీ వ్యవస్థలోని అరాచకాలపై ఆయన చేసిన పోరాటం నిరుపమానం. జమీందారీ వ్యవస్థలో లోపాలను వెలికితీసేందుకు ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. ప్రకాశం పోరాటం వల్లే దేశ వ్యాప్తంగా జమీందారీ వ్యవస్థను తరవాత కాలంలో రద్దు చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్శిటీ స్థాపించారు. ముఖ్యమంత్రి కాగానే 2 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన మానవతా వాది ప్రకాశం. రాజకీయాలకు కొంత కాలం దూరమైనా, ప్రజలకు దూరం కాలేదు. పేదల పక్షానే తుది శ్వాస వరకు నిలిచారు. 1957 మే 20న హైదరాబాదులో టంగుటూరి ప్రకాశం పంతులు తుది శ్వాస విడిచారు.
నేడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారి 150వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తన జీవితాన్ని, యావదాస్తిని పేద ప్రజలకు, స్వాతంత్ర్య ఉద్యమానికి ధారపోసిన ప్రకాశం సూర్యుడున్నంత వరకు ప్రజల గుండెల్లో ప్రకాశిస్తూనే ఉంటారు.