ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త సీఆర్‌రావు కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న కల్వంపూడి రాధాకృష్ణారావు ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. 102 సంవత్సరాల వయసులో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన అత్యున్నత పురస్కారం అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం సీఆర్రావును పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
స్టాటిస్టిక్స్ పేరు చెబితే సిఆర్రావు పేరు గుర్తుకు వస్తుంది. గణాంకశాస్త్రంలో ఆయన చేసిన సేవలు అనేక రంగాల అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్రావును ఈ ఏడాదే వరించింది. 102 ఏళ్ల వయసులో ఆయన ఈ అవార్డు అందుకోవడం విశేషం.
సీఆర్‌రావు 1920లో కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. బాల్యం ఎక్కువగా ఏపీలోనే గడిచింది. నందిగామ, నూజివీడు, గూడూరులో ఆయన బాల్యం గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గణితంలో ఎమ్మెస్సీ చేసిన రావు, తరవాత యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో 1948లోనే పీహెచ్డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్ధిగా చేరిన రావు, ఆ సంస్థకు డైరెక్టరుగా కూడా వ్యవహరించారు.
సీఆర్‌రావు సేవలు అనేక రంగాలకు ఉపయోగపడ్డాయి. కేవలం గణాంక శాస్త్రంలోనే కాదు రావు అందించిన సేవలు ఎకనమిక్స్, జెనెటిక్స్, ఆంత్రోపాలజీ రంగాలకు కూడా విశేషంగా ఉపయోగపడ్డాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సీఆర్‌రావు అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంస్థను హైదరాబాదులో స్థాపించడంలో రావు కీలకంగా వ్యవహరించారు. ప్రపంచంలో 19 దేశాల నుంచి 39 పీహెచ్‌డీలు అందుకున్నారు. 477 పరిశోధనా పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడి చేతుల మీదగా అందుకున్నారు.
సీఆర్‌రావు చేసిన అత్యుత్తమ పరిశోధనలు అన్ని తరాలకు ఉపయోగపడుతున్నాయి. అందులో మూడు సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి. క్రామెర్ రావు లోయర్ బౌండ్. గణాంక పరిణామాన్ని అంచనా వేయడంలో నేటికీ ప్రపంచంలో ఇదే అత్యుత్తమ విధానం. రావు బ్లాక్ వెల్ సిద్ధాంతం. మెరుగైన అంచనాలకు సాయపడుతోంది. ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్. ఇది జామెట్రీ విస్తృతికి ఉపయోగపడుతోంది. సేకరించిన డేటా నుంచి సమాచారాన్ని క్రోడీకరించడానికి ఇది సహాయపడుతోంది.
సీఆర్‌రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గణాంక శాస్త్రంలో అత్యున్నత సేవలు అందించిన సీఆర్‌రావు సిద్ధాంతాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు