వివాహం స్వర్గంలో నిశ్చయం అవుతుందంటారు పెద్దలు. కానీ అనేక పెళ్లిళ్లు పీటల మీద కూడా ఆగిపోవడం చూస్తుంటాం. ఇలాంటి అరుదైన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. రామనాథపురం జిల్లా తిరువాడానై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవుపై గ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులు వివాహం చేయాలని నిశ్చయించారు. పొరుగు గ్రామంలో ఓ యువతి తల్లిదండ్రులతో మాట్లాడుకున్నారు. అందరూ పెళ్లికి అంగీకరించారు. ఇక వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.
పెళ్లి తిరువాడానైలోని ఓ ఆలయంలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలయంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక తాళి కట్టే సమయం కూడా వచ్చేసింది. పంతులుగారు మంత్రాలు చదువుతూ వరుడితో తాళికట్టించే ప్రయత్నం చేశాడు. వెంటనే వధువు ఆ వరుడి చేతిలోని తాళిని గుంజుకుని హుండీలో వేసే ప్రయత్నం చేసింది. బంధువులు అడ్డుకున్నారు. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వధువు ఎవరి మాటా వినలేదు.దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వరుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెద్దలు బలవంతం చేయడంతో ఈ పెళ్లికి అంగీకరించినట్టు వధువు చెప్పింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని కూడా పోలీసులకు తెలిపింది. అయితే వరుడు గ్రామంలో పెళ్లి సమయానికి కొంచెం ముందుగా విందు ఏర్పాట్లు చేశారు. విందుకు వచ్చిన వారికి అసలు విషయం తెలిసే సరికే వంటకాలు ఆరగించి చదివింపులు కూడా ఇచ్చేసి వెళ్లిపోయారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు