చంద్రయాన్-3 ఉపగ్రహం మరోసారి చంద్రుడి చిత్రాలు పంపింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా తీసిన చంద్రుడి ఉపరితల చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ రేపు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై దిగుతుందని ఇస్రో ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని మరోసారి ఇస్రో తెలిపింది. ఇప్పటి వరకు అన్నీ అనుకున్న విధంగానే పనిచేస్తున్నాయని, వ్యవస్థలను ప్రతిక్షణం పరిశీలిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం కావడంతో ప్రపంచం దృష్టి మొత్తం భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3పై పడింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ నుంచి వచ్చిన తాజా చిత్రాలు చంద్రుడి ఉపరితలంపై 70 కి.మీ ఎత్తు నుంచి తీసినవిగా ఇస్రో ప్రకటించింది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్ పలు చిత్రాలను పంపింది. ల్యాండ్ కావడానికి ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి. ల్యాండర్ దిగడానికి సరైన ప్రదేశం ఎంచుకోవడంలో చిత్రాలు ఉపకరిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దేశమంతా రేపటి విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైతే దేశ ప్రతిష్ఠ పెరగడంతోపాటు, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. అయితే రేపు సాయంత్రం విక్రమ్ ల్యాండింగ్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే 27వ తేదీ చంద్రునిపై దింపే అవకాశం ఉందని
ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే..