తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు
వెంకట రామమూర్తి 160వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి
29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా
నిర్వహించనున్నట్లు రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు, తెలుగు
భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి విజయబాబు తెలిపారు.
రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని
ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకొంటున్నామని విజయబాబు చెప్పారు. పిల్లల భవిష్యత్తు అవసరాల
కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోను, పాలనా
వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలుగు భాషా వారోత్సవాలను జిల్లా
కేంద్రాలతో పాటు రాష్ట్రస్థాయిలో గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో ఘనంగా
నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు,
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర
సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరి పోటీలు నిర్వహిస్తామన్నారు. సాహితీ
స్రష్టలను, భాషా సేవకులను, భాషా
వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని సత్కరిస్తామన్నారు.
తెలుగు భాషా వారోత్సవాలు ఈ
నెల 23న గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రారంభమై 29న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముగుస్తాయని విజయబాబు
తెలిపారు. 24న విజయవాడ
ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలోను, 25న విజయవాడలోని ఆంధ్ర లయోలా
డిగ్రీ కళాశాలలోను, 26న విజయవాడలోని బెజవాడ
బార్ అసోషియేషన్ లోను, గుంటూరులోని వెంకటేశ్వర
విజ్ఞాన్ మందిరంలోను, 27న విజయవాడ ఘంటసాల సంగీత విశ్వవిద్యాలయంలోను మరియు 28న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోను పలు
కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.