చంద్రునిపై రేపు సాయంత్రం కాలుమోపడం ద్వారా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు చరిత్ర సృష్టించబోతున్నాయి. అయితే ల్యాండర్ చంద్రుడిపై దిగే ముందు 20 నిమిషాల సమయం చాలా సంక్లిష్ణమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే 20 నిమిషాల సమయం చాలా భీతిగొలుపుతుందని అది టీ 20 ఫైనల్ మ్యాచ్ కన్నా ఉత్కంఠగా ఉంటుందని ఇస్రో చెబుతోంది.
చంద్రయాన్-3 ప్రయోగంలో శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో బాహుబలి రాకెట్ మార్క్-3 కీలకపాత్ర పోషించింది. భూమి నుంచి 3.84 లక్షల కి.మీ దూరంలోని చంద్ర గ్రహాన్ని చేరుకునే క్రమంలో అనేక దశలను విజయవంతంగా పూర్తి చేశారు. చివరగా శాటిలైట్‌ను చంద్రునికి అత్యంత సమీపంలోకి చేర్చగలిగారు. ఆగష్టు 17న మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. తరువాత చంద్రయాన్-3 శాటిలైట్‌ను 153 నుంచి 163 కి.మీల చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టారు. మరింత దూరం తగ్గించి 25 నుంచి 134 కి.మీ కక్ష్యకు తగ్గించారు. చంద్రయాన్-2లో కూడా ఈ పనిని విజయవంతంగా చేశారు.
చంద్రుని కక్ష్యలోని 25 కి.మీ నుంచి ఉపరితలంపై దిగేందుకు బెంగళూరు ఇస్రో పరిశోధనా కేంద్రం నుంచి అందే సంకేతాల ఆధారంగా విక్రమ్ ల్యాండర్ కదలనుంది. చివరి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియ చేపడతారు. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. రాకెట్ ప్రయోగించిన సమయంలో గంటకు 6048 కి.మీ వేగంతో కక్ష్యలోకి దూసుకెళుతోంది. ఇది సాధారణ విమాన వేగం కన్నా పదిరెట్లు ఎక్కువ.
విక్రమ్ ల్యాండర్ వేగం తగ్గించేందుకు ఇంజన్లో ఫైరింగ్ జరుపుతారు. దీన్నే రఫ్ బ్రేకింగ్ దశ అంటారు. ఇది చివరి 11 నిమిషాల్లో చేపడతారు. ఆ సమయంలో ల్యాండర్ దిశ అడ్డంగా ఉంటుంది. దీన్ని ఫైన్ బ్రేకింగ్ దశలో నిలువుగా తిప్పాల్సి ఉంటుంది. చంద్రయాన్-2 ఈ దశలోనే అదుపు తప్పి కుప్పకూలిపోయింది.
చంద్రుని ఉపరితలంపైన 800 మీటర్ల ఎత్తులో క్షితిజ సమాంతర దిశలో అడ్డం, నిలువు వేగాలు సున్నాగా ఉంటాయి. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ దిగే ప్రాంతాన్ని గమనిస్తూ ఎంచుకుంటుంది. చంద్రుని ఉపరితలంపై 150 మీటర్లకు చేరువైనప్పుడు ల్యాండర్ మరోసారి ఫోటోలను పంపుతుంది. దిగడానికి ఆ ప్రదేశం అనుకూలంగా ఉందా లేదా అనేది తెలుసుకుంటారు.
ఈ సమయంలో కేవలం లూనార్ ఇంజన్‌ను రెండుసార్లు మండిస్తారు. ల్యాండర్ కాళ్లు గంటకు 10.8 కి.మీ వేగం తట్టుకునేలా రూపొందించారు. ఎప్పుడైతే విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకుతుందో వెంటనే సెన్సార్లు పనిచేస్తాయి. ఇక ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తే అది ఎటు కావాలంటే అటు తిప్పుకునే వీలుంటుంది.
చివరగా విక్రమ్ ల్యాండర్ ఫోటోలను రోవర్, రోవర్ ఫోటోలను విక్రమ్ ల్యాండర్ తీసుకుంటాయి. తరవాత అసలైన పని మొదలవుతుంది. విక్రమ్ ల్యాండర్, రోవర్లు సూర్య శక్తి ఆధారంగా పనిచేస్తాయి.
అన్ని అనుకున్న విధంగా జరిగితే రేపు సాయంత్రానికి చంద్రునిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రోకే కాదు, దేశానికి కూడా ఒక పెద్ద ముందడుగుగానే చెప్పాల్సి ఉంటుంది.