హర్యానాలోని నూహ్ జిల్లాలో గత నెల
జరిగిన హింసాకాండ కేసులో నిందితుణ్ణి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. అయితే
నిందితుడు ఆమిర్ అంత సులువుగా పట్టుబడలేదు. పోలీసులపైనే కాల్పులు జరిపి
తప్పించుకోడానికి ప్రయత్నించాడు.
ఆమిర్ తన సహచరులతో కలిసి ఆరావళి పర్వత
ప్రాంతం సమీపంలోని తౌరులో తలదాచుకున్నాడు. ఆ సమాచారం తెలిసిన పోలీసులు గాలింపు
చర్యలు మొదలు పెట్టారు.
పోలీసుల రాకను పసిగట్టిన ఆమిర్ వారిపైకి
కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు కూడా అతనిపై కాల్పులు జరిపారు. ఆ క్రమంలో
ఆమిర్ కాలికి గాయమైంది. నూహ్ హింసాకాండ కేసులో నిందితులు పోలీసులపైకి కాల్పులు
జరపడం ఇది రెండోసారి.
ఈ కేసుకు సంబంధించి మరికొందరు నిందితులు
కూడా ఆరావళి పర్వతప్రాంతంలోనే ఉన్నారని సమాచారం. వారిని వెతికి పట్టుకోడానికి తాము
ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
పట్టుబడిన నిందితుడు ఆమిర్‌కు ఘనమైన
నేరచరిత్రే ఉంది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో అతని మీద కనీసం వంద కేసులు నమోదయి
ఉన్నాయి. అతని తల మీద 25వేల రూపాయల రివార్డు ఉంది. పెద్దపెద్ద షోరూములలోకి
చొరబడడం, అక్కడున్న సామగ్రిని దొంగతనం చేయడంలో ఆమిర్ నేర్పరి. తౌరులో అతను ఒక హత్య
కేసులో కూడా ఉన్నాడు.
ఈ కేసులో బజరంగ్ దళ్ కార్యకర్తలు, గో
సంరక్షకులూ అయిన బిట్టూ బజరంగీ, మోనూ మనేసర్లకు క్లీన్చిట్ ఇచ్చేసినట్టు సోషల్
మీడియాలో బోలెడు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ కోసం వారిని విడిచిపెట్టినట్టు
ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దానిపై పోలీసులు వివరణ ఇచ్చారు. బిట్టూ బజరంగీని
ఇప్పటికే అరెస్టు చేసామని చెప్పారు. ఇటీవలి అల్లర్లలో మోనూ మనేసర్ పాత్రపై విచారణ
జరుపుతున్నట్టు తెలిపారు. హింసాకాండ జరిగిన రోజు మోనూ మనేసర్ ఘటనాస్థలంలో ఉన్నట్టు
ఎలాంటి సాక్ష్యాలూ ఆధారాలూ లేవని పోలీసులు వివరించారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 61 ఎఫ్ఐఆర్లు
నమోదు చేసారు. ఇప్పటివరకూ 280 మందిని అరెస్టు చేసారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తున్నారనే
నెపం మీద వారిని అరెస్ట్ చేసారు. వారిపైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు