దేశమంతా చంద్రయాన్-3 ఫీవర్ ఆవరించింది. చంద్రునిపై ప్రయోగాలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక విజయవంతం కావాలంటూ కొందరు వారణాసిలోని కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నీ సవ్యంగా జరిగితే రేపు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్ కానుందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. వాతావరణం అనుకూలించకపోతే చివరి క్షణంలో ల్యాండర్ దిగే సమయం మారే అవకాశం లేకపోలేదు.
ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి ఎస్.సోమనాథ్ సోమవారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను ఢిల్లీలో కలసి చంద్రయాన్-3 వ్యోమనౌక స్థితిగతులను వివరించారు. అన్నీ అనుకూలిస్తే రేపు సాయంత్రం ల్యాండర్ చంద్రునిపై విజయవంతంగా దిగుతుందని తెలిపారు. వ్యోమనౌకలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని అనుకున్న సమయానికి ల్యాండర్ చంద్రునిపై దిగుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. వ్యోమనౌక కదలికలను ప్రతిక్షణం గమనిస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. చంద్రయాన్-3 విజయవంతమైతే ప్రపంచ అంతరిక్షరంగంలో భారత్ సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగ ఫలితాలను ఇస్రో అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్లతోపాటు డీడీలో ప్రత్యక్షంగా చూడవచ్చని ఇస్రో ప్రకటించింది.
చంద్రయాన్-2 పాక్షికంగా మాత్రమే విజయం సాధించడంతో, అలాంటి పొరపాట్లు మరలా జరగకుండా ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగంలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా విజయవంతం చేయాలని శాస్త్రవేత్తలు పట్టుదలగా ఉన్నారు. చంద్రునికి అతి దగ్గరగా పరిభమిస్తున్న ల్యాండర్ విజయవంతంగా దిగాలని భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రయోగం సక్సెస్ కావాలని కొందరు దేశంలోని అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.