చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు
మొట్టమొదటిసారి అడుగుపెడుతున్న ఘనతను సాధించడానికి భారత్ ఇంకొక్కరోజు దూరంలో ఉంది.
దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు సైతం భారత్ ప్రయోగించిన చంద్రయాన్3 సాఫల్యం కోసం
ఎదురు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన లూనా 25 కూలిపోయిన తర్వాత
ఉత్కంఠ మరీ పెరిగిపోయింది. అగ్రరాజ్యాలు సైతం సాహసించని కొత్త ప్రదేశంలో భారత
శాస్త్రవేత్తలు ప్రయోగించిన ల్యాండర్ అడుగు పెట్టబోతోంది.
ఇలాంటి సమయంలో ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్
దేశప్రజలకు చిర్రెక్కించింది. రోదసీ ప్రయోగాలను అపహాస్యం చేస్తూ కుళ్ళు జోకు వేసిన
ప్రకాష్‌రాజ్…. దాని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే… దాన్ని కూడా
సహించలేక తన జోకును సమర్ధించుకుంటున్నాడు. పైగా తాను పాత మళయాళం జోకును గుర్తు
చేసానే తప్ప ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టలేదంటూ సమర్ధించుకుంటున్నాడు.
సమాజంలో ఒక ఉన్నత స్థాయిలోనూ, ఒక వర్గం ప్రజలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలోనూ
ఉన్నవాడు చేయకూడని పని చేసి పైగా ఎదుటివాళ్ళకు హాస్యాన్ని ఆస్వాదించడం చేతకాదంటూ
వెటకరిస్తున్నాడు.
జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్‌తో
నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా గత నాలుగేళ్ళలోనూ ఎన్నో ట్వీట్లు పెట్టిన
ప్రకాష్‌రాజ్ తాజాగా ఆదివారం నాడు, చంద్రయాన్3 ప్రయోగాన్ని అపహాస్యం చేస్తూ ఒక
ట్వీట్ పెట్టాడు. ‘‘విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద తీసిన మొదటి పిక్చర్’’ అన్న
క్యాప్షన్‌తో ఒక కేరళ చాయ్‌వాలా బొమ్మని ట్వీట్ చేసాడు. దాన్ని బ్రేకింగ్ న్యూస్
అని చెబుతూ దానికి జస్ట్ ఆస్కింగ్ అన్న ట్యాగ్ కూడా తగిలించాడు.
అయితే ప్రకాష్‌రాజ్ ట్వీట్‌ను ప్రజలు
సహించలేకపోయారు. ఒకపక్క భారతదేశం గర్వించదగిన ప్రయోగ ఫలితం కోసం ఉత్కంఠగా
ఎదురుచూస్తుంటే, దాన్ని అపహాస్యం చేస్తూ వెటకారపు పోస్ట్ పెట్టడాన్ని నెటిజన్లు
దుయ్యబట్టారు. ఆ పోస్ట్ సున్నితమైన హాస్యం కాదనీ, తోలుమందపు పరుష వ్యాఖ్య
మాత్రమేనని మండిపడ్డారు. దేశ వైజ్ఞానికులను అపహాస్యం చేస్తూ అవమానించేలా ఉందనీ విరుచుకుపడ్డారు. మూన్
మిషన్‌ను విజయవంతం చేస్తున్న శాస్త్రవేత్తల పట్ల కొద్దిగానైనా గౌరవం ఉంచమని
కోరారు.
‘‘రాజకీయ
దృక్పథం ఏదైనా కావచ్చు, కానీ చంద్రయాన్3 ప్రయోగాన్ని చూసి దేశమంతా గర్వించాలి.
రాజకీయానికీ, జాతీయతా దృక్పథానికీ తేడా తెలుసుకోవాలి’’ అని ఒక నెటిజెన్
వ్యాఖ్యానించాడు.
‘‘ఒక వ్యక్తిని
ద్వేషించడం వేరు, నీ దేశాన్నే ద్వేషించడం వేరు. నీ ఈ పరిస్థితి చూస్తుంటే చాలా
బాధగా ఉంది’’ అంటూ మరొక నెటిజెన్ స్పందించాడు.
ఇలాంటి విమర్శలు
దేశమంతా వెల్లువెత్తుతుండడంతో ప్రకాష్‌రాజ్ ప్లేటు మార్చాడు. తాను చేసిన
సిగ్గుమాలిన పనికి మౌనంగా ఊరుకోవడమో లేక క్షమాపణలు చెప్పుకోవడమో చేయకుండా, తన
వాదనను సమర్థించుకున్నాడు. తనను విమర్శించే ప్రజలందరి మీదా ద్వేషులు అని ముద్ర
వేసేసాడు.
ఆదివారం ట్విట్టర్లో ప్రకాష్‌రాజ్ తన
తాజా వాదనను ఇలా వినిపించాడు. ‘‘ద్వేషం కేవలం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది. నేను
ఆర్మ్‌స్ట్రాంగ్ కాలం నాటి కేరళ చాయ్‌వాలా జోక్‌ని గుర్తు చేసాను, అంతే. నన్ను
ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఏ చాయ్‌వాలా అనుకున్నారో మరి. ఒక జోక్ అర్ధం కాకపోతే, అది
మీ మీద వేసిన జోకే అయి ఉంటుంది. ఎదగండి’’ అని ట్వీట్ చేసాడు.
అయితే ప్రకాష్‌రాజ్ ఉద్దేశం సుస్పష్టం.
జస్ట్ ఆస్కింగ్ అన్న ట్యాగ్‌తో ఇన్నాళ్ళూ ప్రకాష్‌రాజ్ ఎవరిని లక్ష్యం
చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల తన వ్యతిరేకతను ప్రకాష్‌రాజ్
ఏనాడూ దాచుకోలేదు. ఇప్పుడు చంద్రయాన్ సందర్భంగా కేరళ చాయ్‌వాలాను సాకుగా
పెట్టుకుని కుళ్ళుజోకు వేసాడు. దాన్ని సమర్ధించుకుంటున్నాడు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
కాలం నాటి మళయాళీ జోకును గుర్తు చేసానని చెబుతున్నాడు. తన సంస్కారాన్ని మరోసారి
బైటపెట్టుకున్నాడు.
ఒకటి మాత్రం నిజం. ప్రకాష్‌రాజ్
చెప్పినట్టు ద్వేషం అన్నిటిలోనూ ద్వేషాన్నే చూస్తుంది. నరేంద్ర మోదీ మీద తన ద్వేషం
కారణంగా చంద్రయాన్ ప్రయోగంలో సైతం ప్రకాష్‌రాజ్ అదే ద్వేషాన్ని, ఓర్వలేనితనాన్నీ
చూపుతున్నాడు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు