చంద్రునిపై పరిశోధనలకు తాజాగా రష్యా పంపిన లూనా – 25 విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యోమనౌక ప్రయోగంలో పాల్గొన్న రష్యా శాస్త్రవేత్త మిఖాయిల్ మరోవ్ శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లూనా – 25 ల్యాండర్ కుప్పకూలిపోయిన తరవాత 90 ఏళ్ల రష్యా శాస్త్రవేత్త మిఖాయిల్ మరోవ్ ఆరోగ్యం వేగంగా క్షీణించిందని ఇండిపెండెంట్ పత్రిక వెల్లడించింది.
‘‘ప్రస్తుతం నేను డాక్లర్ల పర్యవేక్షణలో ఉన్నాను. ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది. ఇది జీవితానికి సంబంధించిందంటూ’’ రష్యా రాజధాని మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ హాస్పటల్లో చికిత్స పొందుతోన్న మెఖాయిల్ మరోవ్ వ్యాఖ్యానించారు. గతంలోనూ మిఖాయిల్ అనేక అంతరిక్ష పరిశోధనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రయోగించిన లూనా – 25 వ్యోమనౌక ప్రయోగంలో కీలకంగా వ్యవహించారు.
లూనా – 25 వ్యోమనౌక విఫలం కావడం బాధాకరం, చంద్రనిపై రష్యా ప్రయోగాలను మరలా చూడాలనేది నా చివరి ఆశ అంటూ మరోవ్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాజా ప్రయోగం విఫలంపై చర్చలు, పరీక్షలు జరుగుతున్నాయని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
పశ్చిమ దేశాలు రష్యాను ఒంటరి చేయడంతో చంద్రునిపై ప్రయోగాలు మరోసారి మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. లూనా – 25 వ్యోమనౌక విఫలం కావడంతో రష్యా అంతరిక్ష ప్రయోగాల్లో అనిశ్చితి నెలకొంది. లూనా – 25 ల్యాండర్ అనుకోని కక్ష్యలోకి ప్రవేశించి చంద్రుడిని ఢీ కొట్టడంతో ప్రయోగం విఫలమైందని రష్యా అంతరిక్ష సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.