దొంగతనాలు అదుపు చేయాల్సిన పోలీసే తెగబడ్డాడు. విధులకు సెలవు పెట్టి ఇళ్లల్లో దొంగతనాలకు దిగిన ఘటన విజయనగరంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం. విజయనగరానికి చెందిన శ్రీనివాసరావు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో సెలవు పెట్టి విజయనగరం వచ్చేశారు. నగరంలోని ఉడా కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటుపడి లక్షల్లో అప్పులపాలయ్యాడు.
ఉద్యోగంలో చేరలేదు సరికదా, తాళాలు వేసిన ఇళ్లకు కన్నాలు వేయడం మొదలు పెట్టాడు. ఇలా వరుసగా 12 చోట్ల దొంగతనాలు చేసి బంగారం, వెండి, నగదు కాజేశాడని పోలీసులు తెలిపారు.పగలు రెక్కీ వేయడం, రాత్రి 9 గంటలు కాగానే దొంగతనాలకు బయలు దేరడం, 12 గంటలకే చోరీ చేసి ఇంటికి చేరుకోవడం మొదలు పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా సమయాలను ఎంచుకున్నాడు. విజయనగరంలోని ఉడాకాలనీ, అలకనంద కాలనీ, రింగురోడ్డు, బాబామెట్ట ఇలా అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు.
వరుస దొంగతనాలు పెరిగిపోవడంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ నెల 14న ఆర్టీసీ కాలనీలో శ్యామ్‌కుమార్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. శాలిపేట వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీనివాసరావు ఓ సంచితో అనుమానంగా తిరగడం గమనించి పట్టుకున్నారు. తనిఖీ చేయగా తాళాలు పగలగొట్టడానికి అవసరమైన వస్తువులు సంచిలో గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాలు అంగీకరించాడు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారం, ఆరు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి శ్రీనివాసరావును జైల్లో పెట్టారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు