చంద్రయానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రుడి
చుట్టూ ఇప్పటికే స్థిరపడిన చంద్రయాన్ 2 ఆర్బిటర్, ఇవాళ చంద్రయాన్ 3 ల్యాండర్
మోడ్యూల్‌తో కనెక్ట్ అయింది. ఆర్బిటర్, ల్యాండర్ రెండూ ఇప్పుడు పరస్పరం
కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాయి.
‘వెల్కమ్ బడ్డీ’ అంటూ చంద్రయాన్2 ఆర్బిటర్ ఒక
సంకేతం ద్వారా చంద్రయాన్3 ల్యాండర్‌ను ఆహ్వానించింది. ఆర్బిటర్, ల్యాండర్ రెండింటి
మధ్యా సమాచార వినిమయ సంబంధం ఏర్పడింది. ‘ఇప్పుడు ల్యాండర్ మోడ్యూల్‌ను
చేరుకోడానికి మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ వద్ద అదనపు దారులున్నాయి’ అని ఇస్రో
ట్వీట్ చేసింది.
చంద్రయాన్ 3 భారత కాలమానం ప్రకారం ఆగస్ట్ 23
సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి మీద దిగుతుంది. ఆ చారిత్రక ఘట్టాన్ని ఇస్రో
ప్రత్యక్షప్రసారం చేస్తుంది.
చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు ల్యాండర్ మోడ్యూల్
చేరుకునే క్షణాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలే కాదు, భారత ప్రజలందరూ ఆత్రుతగా ఎదురు
చూస్తున్నారు. ‘ఇవి చాలా ఉద్విగ్నకర క్షణాలు. ఈసారి ప్రయోగం కచ్చితంగా
విజయవంతమవుతుంది’ అని చంద్రయాన్ 2 మిషన్ ఇన్ఛార్జ్, ఇస్రో మాజీ డైరెక్టర్ కె
శివన్ ధీమాగా చెప్పారు. రష్యా లూనా25 వైఫల్యం నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయం గురించి
ప్రశ్నించినప్పుడు శివన్, ‘‘మనకంటూ ఒక వ్యవస్థ ఉంది. చంద్రయాన్ 3 ఏ సమస్యా లేకుండా
సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. కాకపోతే అది అంత సులువు కాదు. చాలా సంక్లిష్టమైన
ప్రక్రియ’’ అని చెప్పారు. చంద్రయాన్ 2 మిషన్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అన్ని
జాగ్రత్తలూ తీసుకున్నట్టు వివరించారు. ఈ అదనపు వ్యవస్థలు దేశీయంగానే రూపొందించారా
అని అడిగినప్పుడు ‘‘మొత్తం అంతా దేశీయంగా రూపొందించినదే’’ అని శివన్ స్పష్టం
చేసారు.
చంద్రుడి దక్షిణ ధ్రువం
వైపు ఇప్పటివరకూ ఏ ఉపగ్రహమూ వెళ్ళలేదు. చంద్రయాన్ 3 ప్రయోగం సఫలమైతే ఆ ఘనత సాధించిన
మొదటి దేశం భారత్ అవుతుంది. చంద్రుడి మీద క్షేమంగా ల్యాండ్ అవడం, రోవర్ చంద్రుడి
ఉపరితలం మీద తిరగగలగడం, కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చేయడం ఈ ప్రయోగం లక్ష్యాలు.