తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 115 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. పంచమి పూట మంచిదని ఈ మధ్యాహ్నం గులాబీపార్టీ అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో నాలుగు స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లు చెప్పిన కేసీఆర్… పలు కారణాలతో ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ విడుదల చేసిన జాబితాలో పేర్కొన్నారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని రాబోయే నాలుగు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
మజ్లిస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందన్న కేసీఆర్, స్నేహపూర్వక పోటీలో భాగంగా ఉమ్మడి హైదరాబాద్ లోని 29 సీట్లకు 29 తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 95 నుంచి 105 చోట్ల విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 17 లోక్‌సభ సీట్లలో కూడా తామే విజయభేరీ మోగిస్తామన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాన్ని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించినట్లు కేసీఆర్ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యేగా ప్రస్తుతం చెన్నమనేని రమేష్ ఉన్నారు. ఆయన పౌరసత్వం విషయంలో వివాదం ఉండటంతో ఈ సారి టికెట్ దక్కలేదు. చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ కేటాయించారు.
ఖానాపూర్ శాసనసభ్యురాలిగా రేఖానాయక్, కారు గుర్తు పై రెండుసార్లు గెలిచారు. కానీ ఈసారి ఆమెకు నిరాశే మిగిలింది. భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ కు కేటాయించారు. ఈయన కేటీఆర్ కు సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు ఉన్నప్పటికీ టికెట్ కోవా లక్ష్మీకి ప్రకటించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం దక్కలేదు. బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఖరారు చేశారు. స్టేషన్ ఘన్పూర్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించారు. వైరా టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదంటూ బానోతు మదన్ లాల్ పేరును ప్రకటించారు. బోథ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం రాథోడ్ బాపూరావు ఉన్నారు. ఈయనకు బదులు అనిల్ జాదవ్ కు టికెట్ ఇచ్చారు. ఈయన కూడా కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తరఫున గెలిచి బీ(టీ)ఆర్ఎస్ లో విలీనమైన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, అలాగే టీడీపీ తరఫున గెలిచి కేసీఆర్ కు మద్దతు తెలిపిన సండ్ర వెంకటవీరయ్యకు ఈసారి బీఆర్ఎస్ టికెట్లు దక్కాయి. గత ఎన్నికల్లో హస్తం గుర్తు పై గెలిచి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డికి కూడా మహేశ్వరం టికెట్ కేటాయించారు.
రెండు స్థానాల్లో పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటించడంపై బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. గజ్వేల్ లో బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీకి సిద్ధమవ్వడంతో ఓటమి భయంతో కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నారని కాషాయ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత పోటీ చేసే రెండు చోట్ల ఓటమి చెందుతారని కాంగ్రెస్ నాయకులు జోస్యం చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు