రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలను 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నెరవేర్చిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి గుర్తు చేసారు. ఓటరు అవగాహనపై విజయవాడలో నిర్వహించిన బీజేపీ శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, సంస్థలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పురందరేశ్వరి విమర్శించారు. ఏపీకి గడచిన తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు.
ఏపీలో ఓటర్ల జాబితాలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని పురందరేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఈసీ ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు ఆమె గుర్తు చేసారు. అర్హుల ఓట్లు తొలగిస్తున్న అధికారులపై కఠిన చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనే ఆయుధాన్ని దూరం చేసే కుట్రలు సాగుతున్నాయని పురందరేశ్వరి అన్నారు. అధికారులు ఓటర్ల జాబితాలను పారదర్శకంగా తయారు చేయాలని ఆమె సూచించారు.
ఏపీలో మద్యం అమ్మకాల్లో భారీ అవినీతి జరుగుతోందని పురందరేశ్వరి విమర్శించారు. దేశంలో సామాన్యులు సైతం డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తుంటే ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తోన్న మద్యం దుకాణాల్లో మాత్రం డిజిటల్ విధానం అమలు చేయడం లేదని ఆమె ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో వేలకోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. నాణ్యతలేని మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలను హరిస్తూ, సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని పురందరేశ్వరి దుయ్యబట్టారు. కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటూ, ప్రజలకు సంక్షేమం చేస్తున్నామని చెప్పుకుంటున్నారని పురందరేశ్వరి ఎద్దేవా చేశారు.
కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ దేశంలో చేయని విధంగా పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించిందని పురందరేశ్వరి తెలిపారు. కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్ని దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని ఆమె కొనియాడారు. దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు