దేశ భవిష్యత్తు అయిన పిల్లలను తీర్చిదిద్దడానికి
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో కొత్తగా
నియామకం అవుతున్న ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
అన్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్లో ప్రాంతీయ భాషలకు
ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. మధ్యప్రదేశ్ ఉద్యోగ మేళాను ఉద్దేశించి మోదీ వర్చువల్గా
ప్రసంగించారు.
మధ్యప్రదేశ్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఉద్యోగ
మేళా ద్వారా 5,500 మందికి పైగా అభ్యర్ధులు ఉద్యోగాలు పొందారు. వారందరికీ ప్రధాని
మోదీ శుభాభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు గత
మూడేళ్ళలో దాదాపు 50వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసింది. అరుదైన ఆ రికార్డు
సృష్టించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోదీ అభినందించారు. దేశాన్ని అభివృద్ధి
పథంలో నడిపించే లక్ష్యంతో నూతన విద్యా విధానానికి రూపకల్పన చేసామనీ, దాన్ని అమలు
చేయడంలో ఈ కొత్త ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారనీ మోదీ వ్యాఖ్యానించారు.
భవిష్యత్ టెక్నాలజీలతో పాటు సంప్రదాయిక విజ్ఞానానికి కూడా సమాన ప్రాధాన్యత
ఇస్తున్నామని వివరించారు.
ప్రధాని మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధనకు
పెద్దపీట వేస్తూ ప్రాథమిక విద్యకు కొత్త కరిక్యులమ్ సిద్ధం చేసామని చెప్పారు. మాతృభాషలో
విద్యాభ్యాసం దిశగా ముందడుగు వేస్తున్నామనవి చెప్పారు. ఇంగ్లీషు తెలియని పిల్లలకు
అమ్మభాషలో పాఠాలు చెప్పకపోవడం వారికి అన్యాయం చేయడమేనని మోదీ వ్యాఖ్యానించారు, విద్యావ్యవస్థ
ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాల్ ప్రాంతీయ భాషల్లో బోధన అని ప్రధానమంత్రి చెప్పారు.
‘‘సానుకూల దృక్పథంతో, సరైన ఉద్దేశంతో, సమీకృత
శక్తితో ముందడుగు వేసి నిర్ణయాలు తీసుకుంటే, మొత్తం వాతావరణం అంతా పాజిటివిటీతో
నిండిపోతుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. అదే సమయంలో ఆయన రెండు విషయాల గురించి
నిర్దిష్టంగా చెప్పారు. అమృత కాలపు మొదటి ఏడాది అయిన ప్రస్తుత కాలంలో దేశపు
పేదరికం తగ్గుతుంది, సమృద్ధి పెరుగుతుందని చెప్పారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక
ప్రకారం కేవలం 5 సంవత్సరాల్లో 13న్నర కోట్ల మంది భారతీయులు దారిద్ర్య రేఖ దిగువ
నుంచి పైకి చేరుకున్నారని మోదీ గుర్తు చేసారు. మరో అంశం ఏంటంటే, గత తొమ్మిదేళ్ళలో
ప్రజల సగటు ఆదాయం బాగా పెరిగింది. దానికి నిదర్శనం ఈ యేడాది దాఖలైన ఐటీ రిటర్నులు.
2014లో రూ.4 లక్షలు ఉన్న సగటు ఆదాయం 2023 నాటికి రూ.13 లక్షలకు పెరిగిందని, ప్రజలు
అల్పాదాయవర్గం నుంచి అధికాదాయవర్గంలోకి పెద్దసంఖ్యలో మారుతున్నారనీ మోదీ చెప్పారు.
దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని ప్రధాని వివరించారు.
దేశ ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోంది.
తాము పన్నుగా కట్టే ప్రతీ పైసా అభివృద్ధికే వినియోగపడుతోందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే పౌరులు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా
ముందుకొచ్చి పన్నులు కడుతున్నారు. 2014 నాటికి పదో స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ
ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. మరికొద్దికాలంలో మూడో స్థానానికి చేరుకుంటుంది…
అని మోదీ చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు