భారత అంతరిక్ష సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఎట్టి పరిస్థితుల్లో విఫలమయ్యే అవకాశం లేదని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రముఖ శాస్త్రవేత్త రాధాకాంత్ పధి అభిప్రాయపడ్డారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా స్వయంగా చక్కదిద్దుకునేలా దాన్ని తీర్చిదిద్దినట్టు ఆయన వెల్లడించారు. చంద్రయాన్-2 నుంచి అనేక గుణపాఠాలు నేర్చుకుని గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్ననట్టు రాధాకాంత్ పధి పేర్కొన్నారు.
చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ వేగాన్ని అదుపుచేసుకోలేకపోవడంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కూలిపోయిందని అలాంటివి మరలా జరిగే అవకాశం లేదన్నారు. విక్రమ్ ల్యాండర్ పాదాలు మరింత పఠిష్ఠంగా అనుకూలంగా తీర్చిదిద్దినట్టు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగుళూరు యూనివర్శిటీలోని ఏరోస్పేస్ శాస్త్రవేత్త రాధాకాంత్ పధి స్పష్టం చేశారు. చంద్రయాన్-2, చంద్రయాన్-3 రెండు ప్రయోగాల్లోనూ బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి రాధాకాంత్ పాల్గొన్నారు.
చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు అతివిశ్వాసానికిపోయారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా స్వయంగా తప్పులను సరిదిద్దుకుని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని రాధాకాంత్ చెప్పుకొచ్చారు. సిక్స్ సిగ్మా బౌండ్స్ సాంకేతికతతో ల్యాండర్ రూపొందించినట్టు, ఇది చాలా దృఢమైనదని ఆయన గుర్తుచేశారు. చంద్రయాన్-3ని అన్ని కోణాల్లో శాస్త్రవేత్తలు పరీక్షించినట్టు రాధాకాంత్ వెల్లడించారు.
ల్యాండింగ్ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే దిగడానికి అనుకూలమైన ప్రదేశాన్ని విక్రమ్ ల్యాండర్ కనుగొంటుందని రాధాకాంత్ చెప్పారు. విక్రమ్ ల్యాండర్లో రెండు కంప్యూటర్లు ఉన్నాయని, చంద్రయాన్-2లో ఒకటి మాత్రమే ఉందని రాధాకాంత్ గుర్తుచేశారు. 99.9 శాతం విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగుతుందన్నారు. తాజాగా శాటిలైట్ పంపిన చిత్రాలపై కూడా ఆయన స్పందించారు. ఈ చిత్రాల ద్వారా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ల్యాండర్ గుర్తిస్తుందన్నారు.
ముందుగా ఇస్రో ప్రకటించిన విధంగా బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతుందని రాధాకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.