ప్రయాగరాజ్
లోని అత్యంత పురాతన మహిమాన్విత వాసుకీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ సోమవారంతో
పాటు నాగపంచమి కావడంతో పవిత్రక్షేత్రం భక్తులతో నిండిపోయింది. నాగ వాసుకీ ఆలయం
ముందు పెద్దఎత్తున భక్తులు బారులు తీరారు. శివయ్యను దర్శించి నాగదేవత వాసుకీకి
ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తూ మహాదేవుడి స్మరణలో భక్తులు మునిగిపోయారు. ఆదిదంపతుల నామస్మరణతో త్రివేణీ సంగమం
పులకిస్తోంది.
సనాతన
ధర్మంలో నాగపంచమికి ప్రత్యేక స్థానం ఉందన్న వాసుకీ ఆలయం ప్రధాన పురోహితుడు శ్యామ్ధర్,
ఈ రోజు నుంచే అన్ని పండుగలు ప్రారంభం
అవుతాయన్నారు. సనాతన ధర్మంలో సర్పానికి ప్రాముఖ్యత ఉందని, దేవతగా పూజిస్తారని
వివరించారు, గంగానది ఒడ్డున ఉన్న సర్పరాజు వాసుకీ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు
పోటెత్తడానికి అదే కారణమన్నారు. ఐశ్యర్యం కోసం ప్రత్యేక పూజలు చేస్తారని
వివరించారు. ప్రకృతి ప్రసాదించిన వస్తువులను పాముకు ప్రసాదంగా అందజేసే ప్రక్రియ
అనాదిగా కొనసాగుతుందన్నారు. అలాగే
పర్యావరణాన్ని కాపాడటంలో పాము పాత్ర కూడా
ఉందన్నారు. ఎలుకల నుంచి వరి పంటను రక్షించడంలో నాగుపాము పాత్ర
ఎనలేనిదన్నారు.
శేష అవతారుడైన లక్ష్మణ స్వామికి
అయోధ్యలో ఇవాళ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ రోజు నాగదేవతా ప్రతిమలకు పూజలు చేస్తే
అవి సర్పదేవతలకు చేరతాయని, తద్వారా వివేక వంతులైన సంతానం కలగడంతో పాటు నాగదోషాలు
తొలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పాలు, నువ్వుల లడ్డు, చలివిడిని పుట్టల వద్ద
ఉంచి భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు.