కొద్ది గంటల్లో చంద్రుడిపై కాలుమోపనున్న చంద్రయాన్- 3 వ్యోమనౌక తాజాగా కొన్ని చిత్రాలను పంపింది. ల్యాండర్ దిగేందుకు అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ల్యాండర్ కొన్ని చిత్రాలను పంపించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై రేపు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ దిగనుంది.
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపైకి పంపిన వ్యోమనౌక నుంచి విడిపడ్డ ల్యాండర్ సురక్షిత ప్రాంతంలో దిగేందుకు అనువైన ప్రదేశాన్ని అన్వేషిస్తున్నారు. ల్యాండర్ దిగే ప్రాంతంలో లోతైన కందకాలు, బండరాళ్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం ఇస్రో ప్రత్యేక కెమెరాను అభివృద్ది చేసింది. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా ( ఎల్హెచ్డిఎసి) ఈ తాజా చిత్రాలను తీసింది. గత శనివారం పంపిన చిత్రాల్లో భారీ బిలాలను గుర్తించారు. హైన్, బాస్ ఎల్, మారి హంబోల్డ్టియానమ్, బెల్ కోబిచ్ బిలాల ఫోటోలు ఇస్రోకు అందాయి.
అన్ని అనుకున్న విధంగా సవ్యంగా జరిగితే రేపు సాయంత్రం 6 గంటల నాలుగు నిమిషాలకు ల్యాండర్ చంద్రునిపై దిగనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్
అమెరికా, రష్యా, చైనా సరనస చేరుతుంది.
చంద్రయాన్-3 తాజాగా పంపిన ఫోటోలపై నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ విమర్శలకు దారితీసింది. లుంగీ ధరించి టీ కలుపుతున్న వ్యక్తి ఫోటోను చంద్రయాన్- 3 పంపించిందంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రధాని మోదీని కించపరుస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై మండిపడుతున్నారు. చంద్రయాన్‌కు రాజకీయ రంగు పులమొద్దని నెటిజన్లు ప్రకాష్ రాజ్‌కు సలహాలిస్తున్నారు.