విశాఖ జిల్లా సీతపాలెం బీచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యువత సరదా కాస్తా ప్రాణాల మీదకు తెచ్చింది.
ఆదివారం సరదాగా విశాఖ జిల్లా సీతపాలెం బీచ్ వద్ద సముద్రపు అంచులో ఉన్న బండరాయిపై నిలబడి గ్రూప్ ఫోటో కోసం ప్రయత్నించిన ఆరుగురు స్నేహితులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. సమీపంలోని వారు పెద్దగా కేకలు వేయడంతో మత్స్యకారులు నలుగురిని కాపాడగలిగారు.
ఈ ప్రమాదంలో సాయి అనే యువకుడు చనిపోయాడు. సాయి ప్రియాంక ప్రాణాపాయ స్థితిలో విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో నలుగురు కట్టోజు కావ్య, గన్నవరపు రవిశంకర్, కండిపట్టి ఫణీంద్ర, కండిపల్లి సాయికిరణ్‌లను మత్య్సకారులు కాపాడగలిగారు. సీతపాలెం బీచ్ వద్ద గల్లంతైన సాయి మృతదేహం అచ్చుతాపురం మండలం పూడిమడక తీరానికి కొట్టుకువచ్చింది. సాయి మృతదేహాన్ని అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విశాఖ జిల్లాలో 11 మండలాల పరిధిలోని సముద్ర తీరంలో ప్రతి వారం ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉంది. వారాంతంలో వేలాది మంది పర్యాటకులు బీచ్‌కు వస్తుంటారు. పోలీసులు ప్రమాద హెచ్చరికలు చేస్తున్నా ప్రయోజనం దక్కడం లేదు. పొడవైన తీరం వెంట అతి కొద్ది మంది పోలీసు సిబ్బంది పర్యాటకులను అదుపు చేయలేకపోతున్నారు.
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు సమీపంలో పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు