రష్యా పంపిన వ్యోమనౌక లూనా-25 చంద్రుడిని ఢీ కొట్టి కూలిపోయిందని ఆ దేశ అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ప్రకటించింది. 47 సంవత్సరాల తరవాత రష్యా ఈ మిషన్ చేపట్టి విఫలమైంది. లూనా-25 చంద్రుడిపై మరొక రోజులో అడుగు పెట్టే సమయంలో సమస్యలు తలెత్తినట్టు రాస్‌కాస్మోస్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. లూనా-25 అనుకోని కక్ష్యలోకి వెళ్లడం వల్ల అది చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ తెలిపింది.
రేపు లూనా-25 చంద్రుడిపై దిగాల్సి ఉండగా అంతర్జాతీయ కాలమానం ప్రకారం శనివారం 11 గంటల 10 నిమిషాలకు ల్యాండర్‌ను కక్ష్య తగ్గించే క్రమంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయని రాస్‌కాస్మోస్ ప్రకటించింది. తాజాగా ప్రయోగించిన వ్యోమనౌక విఫలమైనంత మాత్రాన రష్యా అంతరిక్ష సామర్థ్యాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రపంచంలోనే మొదటి సారి 1957లో రష్యా స్పుత్నిక్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అంతేకాదు 1961 ప్రపంచంలోనే మొదటిసారి రష్యాకు చెందిన యూరీ గగారిన్ అంతరిక్షంలో అడుగుపెట్టారు. 1976 నుంచి రష్యా చంద్రుడిపై ప్రయోగాలను నిలిపివేసింది. 47 సంవత్సరాల తరవాత రష్యా తాజాగా ప్రయోగించిన లూనా-25 కుప్పకూలిపోయింది.
భారత్ చంద్రయాన్-3 చేపట్టిన సమయంలోనే రష్యా లూనా-25 వ్యోమనౌక చంద్రుడిపైకి ప్రయోగించడంతో చర్చకు దారితీసింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెల 23న భారత వ్యోమనౌక చంద్రుడిపై కాలుమోపనుంది. ఇప్పటికే చైనా, అమెరికా దేశాలు చంద్రుడిపై అనేక ప్రయోగాలు చేసి ముందు వరుసలో నిలిచాయి.