వరద పీడిత హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారం కిందట సిమ్లాలో శివాలయంపై కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. కొండచరియలు తొలగించే కార్యక్రమం చురుగ్గా సాగుతోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి రూప్ శరణ్ తెలిపారు. ఇప్పటికీ కొంత మంది ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
సిమ్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు భారీ యంత్రాలను తరలించడం సమస్యాత్మకంగా మారింది. దీంతో కొండచరియలు విరిగిపడటం వల్ల పేరుకుపోయిన మట్టి, రాళ్లు తొలగించడం ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. సిమ్లా జిల్లాలో శివాలయంపై ఈ నెల 14న కొండచరియలు విరిగిపడటంతో 21 మంది కనిపించకుండా పోయారు. వారిలో 17 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి ఆచూకీ కనుగొనేందుకు సెర్ఛ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు తగ్గుముఖం పట్టినా, రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో హిమాచల్‌ను రెండు సార్లు వరదలు ముంచెత్తాయి. వందలాది మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.