ఏపీలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తీవ్రమైన కరవు పరిస్థితులతో కళ్ల ముందే పంటలు ఎండిపోవడంతో కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం. ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు మండలం కునుకుంట్లకు చెందిన సుబ్బారాయుడు అప్పుల బాధతో నాలుగు నెలల కిందట చనిపోయాడు. ఆయన కొడుకు నగేష్‌పై అప్పుల వారు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నందవరం మండలం గురజాలకు చెందిన బీరప్ప అనే రైతు పదెకరాల్లో వరిసాగు చేసి రూ.4 లక్షల అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చెర్వుకు చెందిన రైతు శివకుమార్ తన పొలంలో మూడు బోర్లు వేసి పంటలు సాగు చేశాడు. ఇందుకోసం రూ.12 లక్షలు అప్పులు చేశాడు. పంట చేతికి రాకపోవడంతో అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు మూడెకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టాలు వచ్చాయి. అప్పటికే రూ.5 లక్షల అప్పు కూడా ఉండటంతో తీర్చే మార్గంకానరాక అర్థరాత్రి పొలంలో ఉరేసుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఒకే రోజు నలుగురు రైతుల ఆత్మహత్యలపై రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు