కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. మూడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు నడిరోడ్డుపై భార్యను దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఆకివీడుకు చెందిన మారడుగుల వీరవెంకట సత్యనారాయణ కుమార్తె సంధ్యారాణి అదే ప్రాంతానికి చెందిన రాంబాబును ప్రేమించి వివాహం చేసుకుంది. వారికి ఏడాదిన్నర బాబు కూడా ఉన్నాడు. గొలుసు చోరీ కేసులో రాంబాబు జైలు కెళ్లాడు. దీంతో రాంబాబు భార్య సంధ్యారాణి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. జైలు నుంచి వచ్చిన రాంబాబు పిల్లాడిని ఇచ్చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి.
శనివారం తండ్రితో కలసి భీమేశ్వరాలయానికి వెళ్లి తిరిగొస్తున్న సంధ్యారాణిని అడ్డగించి రాంబాబు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన సంధ్యారాణిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు 108 అంబులెన్స్ సిబ్బంది గుర్తించారు. హత్యకు పాల్పడిన రాంబాబు ఆకివీడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోస్టుమార్టం కోసం సంధారాణి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు