తిరుమలలో గతంలోనే ప్లాస్టిక్ నిషేధించారు. తాజాగా తిరుమల వచ్చే భక్తులెవ్వరూ 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులు తీసుకురాకూడదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుమల కాలి నడక మార్గానికి కంచె నిర్మించే విషయం పరిశీలనలో ఉందని, ఇందుకు కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇటీవల చిరుత దాడిలో చనిపోయిన బాలిక కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించినట్టు మంత్రి గుర్తుచేశారు. భక్తులపై దాడి చేసిన రెండు చిరుతలను బంధించి తిరుమతి జూ పార్కుకు తరలించినట్టు ఆయన వెల్లడించారు.
తిరుపతిలో కాలుష్య నియంత్రణ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి శనివారం ప్రారంభించారు. 34 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.16.50 కోట్లతో పర్యావరణ హితంగా ఈ భవనం నిర్మించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చక్కగా పనిచేస్తోంది, ఆ శాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. త్వరలోనే కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఎక్కడా కాలుష్యం అనేదే లేకుండా ఉండేందుకు నియంత్రణ మండలి చర్యలు చేపట్టిందని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వెల్లడించారు. కాలుష్యం విషయంలో పరిశ్రమలు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.