ప్రాణాలు కాపాడాల్సిన ఓ నర్సు ఉన్మాదిలా మారింది. ఆసుపత్రిలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నవజాత శిశువులను దారుణంగా చంపేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు
ఏకంగా ఏడుగురు శిశువులను చంపేసిన ఘటన ఇంగ్లాండులో చోటు చేసుకుంది. పసిపిల్లల ప్రాణాలు తీయడానికి లూసీ అనే నర్సు ఎంచుకున్న మార్గాలు కూడా మానవత్వాన్ని మంటగలిపేలా ఉన్నాయి. ఇంజెక్షన్ ద్వారా శిశువుల శరీరంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా కడుపులోకి పాలు, నీటికి బలవంతంగా పంపించి శ్వాస నాళాలకు అంతరాయం కలుగజేయడం ద్వారా ఏకంగా ఏడుగురు శిశువులను లూసీ లెబ్డీ చంపినట్టు వెల్లడైంది. మరో ఆరుగురిని కూడా చంపడానికి ప్రయత్నించినట్టు గుర్తించారు.
ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాంచెస్టర్‌లోని క్రౌన్ కోర్టు శుక్రవారం లూసీని దోషిగా తేల్చింది. సోమవారం శిక్షను ఖరారు చేయనుంది. 2015-16లో లూసీ ఈ హత్యలకు పాల్పడిందని దర్యాప్తులో తేలింది. ఎటువంటి విపరీత కారణాలు లేకుండా ఆసుపత్రిలో వరుసగా ఏడుగురు శిశువులు చనిపోవడంతో అనుమానం వచ్చి, సిబ్బంది లూసీపై నిఘా ఉంచి ఆమెను పట్టుకున్నారు.
ఆసుపత్రిలో పనిచేస్తోన్న భారతీయ మూలాలున్న డాక్టర్ జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 2017లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశ పూర్వకంగానే చంపాను. ఎందుకంటే నేను వారిని మంచిగా చూసుకునేంత మనసు నాకు లేదంటూ లూసీ రాసిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కోర్టులో విచారణ ప్రారంభించారు. లూసీ తనపై వచ్చిన ఆరోపణలు మొదట ఖండించారు. లోపాలను కప్పి పుచ్చుకునేందుకే సీనియర్ డాక్టర్లు తనపై నెపం నెట్టారని ఆమె లాయర్ వాదించారు. నవజాత శిశువుల మరణానికి లూసీ కారణమనే సాక్ష్యాలు బలంగా ఉండటంతో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు