ప్రభుత్వాల నిర్ణయాల్లో ఆరోగ్య రంగానికి
ప్రాధాన్యత ఇవ్వాలని కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలకు గుర్తు చేసిందని ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సహకారం విలువ తెలిసొచ్చేలా చేసింది కూడా
కరోనాయేనని మోదీ చెప్పారు.
గుజరాత్లోని గాంధీనగర్లో జరుగుతున్న జీ20 దేశాల
ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం
పంపించారు. కరోనా మహమ్మారి మనకు ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం విలువ తెలిసేలా
చేసిందన్నారు. మందులు పంచుకోవడంలో, వ్యాక్సిన్ల సరఫరాలో, లేదా ప్రజలను ఇతర దేశాల
నుంచి స్వదేశాలకు తరలించడంలో సహకరించుకోవడం ఆవశ్యకతను, ఆ ప్రయత్నాల విలువనూ
గుర్తించేలా చేసింది కోవిడ్ కష్టకాలమేనని ప్రధాని వ్యాఖ్యానించారు.
కరోనా కాలంలో మందుల సరఫరాలో భారత్ పాత్రను
ప్రధానమంత్రి కొనియాడారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం పేరిట భారత్ 100కు పైగా
దేశాలకు 30కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించిన సంగతిని గుర్తు చేసారు. మరో ఆరోగ్య
అత్యవసర పరిస్థితి తలెత్తితే సమర్థంగా ఎదుర్కొని, నివారించేందుకు ప్రపంచ దేశాల
ఆరోగ్య వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘పరస్పరం కనెక్ట్ అయి ఉన్న
ఆధునిక ప్రపంచంలో భవిష్యత్తులో తలెత్తబోయే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొని,
తట్టుకుని నిలబడగలిగేలా మన ఆరోగ్య వ్యవస్థలు ఉండడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని ఏదో
ఒక మూల మొదలయ్యే ఆరోగ్య సమస్యలు ప్రపంచంలోని మిగతా భాగాలన్నింటికీ శరవేగంగా వ్యాపిస్తాయని
కోవిడ్ మనకు చూపించింది’’ అని హితవు పలికారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంస్కృత
సూక్తిని ఆయన గుర్తు చేసారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని దేశాలలోనూ
దక్కుతున్న ఆదరణ, ప్రపంచమంతా కోరుకునేది సంపూర్ణ ఆరోగ్యమేనని నిరూపిస్తోందని మోదీ
విశ్లేషించారు. 2023ను ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించేలా కృషి చేసినట్టు
వెల్లడించారు. ‘‘భారతదేశంలో మేము సంపూర్ణ ఆరోగ్యం కోసం సమీకృత విధానాన్ని
అనుసరిస్తున్నాము. ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాం. వైద్యాన్ని అందరికీ
అందుబాటులో ఉంచుతున్నాం. ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను
ప్రోత్సహిస్తున్నాం. గుజరాత్లోని జామ్నగర్లో WHO గ్లోబల్
సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు ఆ దిశగా ఒక ముందడుగు. ప్రపంచంలోని అన్నిరకాల
సంప్రదాయ వైద్య విధానాలూ ఆ కేంద్రంలో అందుబాటులో ఉంటాయి’’ అని మోదీ
చెప్పుకొచ్చారు.
వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు విజయవంతం కావాలంటే
ప్రజల భాగస్వామ్యం కీలకమని మోదీ అన్నారు. భారత్లో కుష్టువ్యాధి నిర్మూలన
కార్యక్రమం ప్రజా భాగస్వామ్యం వల్లనే విజయవంతమైందని చెప్పారు. ఇప్పుడు క్షయ వ్యాధి
విషయంలోనూ అదే పని చేస్తున్నట్టు వివరించారు. ‘‘‘కుష్టు నిర్మూలన కార్యక్రమంలో
మిత్రులు’గా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చాం. దానికి గొప్ప స్పందన లభించింది. భారత
పౌరులు, సుమారు లక్ష మంది క్షయ రోగులను దత్తత తీసుకున్నారు. ఫలితంగా, 2030 నాటికి
ఈ భూమిమీద కుష్టువ్యాధిని నిర్మూలించాలన్న ప్రపంచదేశాల సామూహిక లక్ష్యాన్ని
సాధించే దిశలో భారత్ చాలా ముందు ఉంది’’ అని వెల్లడించారు.
జి20 దేశాల ఆరోగ్య
మంత్రుల సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించింది. ఆరోగ్య అత్యవసర
పరిస్థితుల నివారణ, ప్రజల్లో రోగ నిరోధక శక్తిపై అవగాహన కల్పించి వారిని
సంసిద్ధులను చేయడం అన్నది మొదటి అంశం. సురక్షితమైన, సమర్ధమైన, నాణ్యమైన, చవకైన మందులను
ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రధాన లక్ష్యంగా ఫార్మా రంగంలో సహకారాన్ని బలోపేతం
చేయడం రెండో అంశం. ఆరోగ్య పరిరక్షణ సేవలను మెరుగు పరచడానికి, సమగ్ర ఆరోగ్య వ్యవస్థను
పటిష్టం చేయడానికి డిజిటల్ ఆవిష్కరణలు, పరిష్కారాలు కనుగొనడం మూడవ అంశం.