రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇవాళ త్రీడీ
ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందిన, దేశంలోనే మొట్టమొదటి పోస్టాఫీస్‌ను
ప్రారంభించారు. ఈ తపాలా కార్యాలయం బెంగళూరులో ఉల్సూర్ బజార్ సమీపంలోని కేంబ్రిడ్జ్
లేఔట్లో ఉంది. 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
‘‘త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగం ద్వారా
ఇవాళ నవీన భారతపు కొత్త రూపం ఆవిష్కృతమైంది. మన దేశం మన సొంత 4జీ, 5జీ
టెక్నాలజీలను అభివృద్ధి చేసుకోగలదని ఎవరూ ఊహించలేదు. టెలికాం రంగంలో భారత్ ఒక
డెవలపర్‌గానూ, ఉత్పాదకురాలిగానూ నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. భారత్ ఒక
ప్రపంచస్థాయి రైలును డిజైన్ చేసి తయారు చేయగలదని ఎవరూ ఊహించలేదు. కానీ ఇవన్నీ
సాధ్యమయ్యాయి. దానికి కారణం ఇప్పుడు మన దేశానికున్న నిర్ణయాత్మక శక్తి కలిగిన
నాయకత్వం. తన దేశ ప్రజల సామర్థ్యాలపై పూర్తి నమ్మకమున్న నాయకుడు ఇప్పుడు దేశాన్ని
నడిపిస్తున్నాడు’’ అని మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు.
త్రీడీ టెక్నాలజీ అనేది భవన నిర్మాణాలలో వచ్చిన
విప్లవాత్మకమైన ఆధునిక టెక్నాలజీ. కంప్యూటర్ ద్వారా రూపొందించే డిజైన్లను
ఉపయోగించి లేయరింగ్ మెథడ్‌లో త్రీడైమెన్షనల్ వస్తువులను తయారు చేసే విధానమిది.
సుమారు ఏడాది క్రితం ఐఐటీ గువాహటి విద్యార్థులు భారత సైన్యం కోసం పూర్తిస్థాయి
దేశీయ పరిజ్ఞానంతో
త్రీడీ ప్రింటెడ్ సెంట్రీపోస్ట్ను రూపొందించారు.