శ్రీశైలం వద్ద శిఖరేశ్వరం దగ్గరలో అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఒక ఎలుగుబంటిని పట్టుకున్నారు. రెండు రోజులుగా శిఖరం చేరువలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఆ విషయం తెలిసి, శిఖర దర్శనం చేసుకోడానికి వెడుతున్న భక్తులు భయపడుతున్నారు.
శ్రీశైలం పరిధిలో ఒక చిరుతపులి కూడా సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో స్థానిక అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిఖరేశ్వరం సమీపంలో మూడు బోన్లు ఏర్పాటు చేసారు. దీంతో ఎలుగుబంటి బోనులో చిక్కింది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటనల వంటివి జరక్కుండా శ్రీశైలంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు, సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి చేరువలోని కాకుల కొండ దగ్గర గురువారం ఒక మగ చిరుతపులి కళేబరం లభ్యమైంది. బుధవారం ఆడచిరుత కళేబరం కనిపించిన స్థలంలో అటవీ శాఖ అధికారులు పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడే మగ చిరుత కళేబరం కూడా కనిపించింది. చిరుతల కళేబరాలను మడకశిర తీసుకువెళ్ళి, పోస్ట్‌మార్టమ్ తర్వాత వాటికి దహన సంస్కారాలు చేసారు.
అటవీశాఖ అధికారులు ఘటనా స్థలం దగ్గర కొన్ని నమూనాలు సేకరించారు. వారు సేకరించిన నమూనాలను పరిశోధనశాలలకు పంపించారు. చనిపోయిన చిరుతపులుల వయసు సుమారు రెండేళ్ళు ఉండవచ్చు. వాటి తల్లి కూడా ఈ కొండప్రాంతంలోనే ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు