విలువలతో
కూడిన మానవీయతను ప్రపంచవ్యాప్తంగా పంచడమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోందని
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళే అన్నారు. సాంస్కృతిక
విలువలు, ఆదర్శవంతమైన జీవనవిధానంతో ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతుందన్నారు.
కేసరి
వారపత్రిక ఆధ్వర్యంలో కేరళలో జరుగుతున్న ‘‘అమృతశతం’’ కార్యక్రమంలో ప్రసంగించిన
హోసబళే, అద్వితీయ జీవన విధానంతో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా మారిందనిచెప్పారు. భారతీయుల్లో జాతీయవాదం మరింత బలంగా
నాటుకుపోవాలన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్
సంఘను స్థాపించిన హెగ్డేవార్ లక్ష్యం కూడా ఇదేనన్నారు.
స్వతంత్ర
సంగ్రామ సమయంలో ఆవిర్భవించిన సంఘ్, స్వాతంత్ర్యం తర్వాత జాతీయ సంస్థగా
అవతరించిందని వివరించారు. వ్యవస్థాపకుల జీవితాన్ని అర్థం చేసుకున్న వారికే సంఘ
సిద్ధాంతమెంటో తెలుస్తుందన్నారు. దేశాన్ని ఆదర్శ నమూనాగా తీర్చేదిద్దేందుకు సంఘ్
వ్యవస్థాపకులు వారి జీవితంలో ప్రతి క్షణాన్ని ధారపోశారని కొనియాడారు.
పుట్టుకతోనే
దేశభక్తుడైన డాక్టర్ హెగ్డేవార్, బాల్యంలోనే దేశ స్వాతంత్రపోరాటంలో పాల్గొన్నారని
గుర్తు చేశారు. బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఉద్యమంలో పాల్గొని విప్లవాత్మక
కార్యక్రమంలో చురుకైన పాత్ర వహించారని వివరించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా జాతిని ఉన్నత
స్థితికి తీసుకెళ్లడమే హెగ్డేవార్ లక్ష్యమని హొసబళే అన్నారు. బలమైన సాంస్కృతిక
పునాది లేకుండా, సమాజం వ్యవస్థీకృతం కాకుండా దేశానికి స్వాంతంత్ర్యం రావడం సాధ్యం
కాదని ఆయన భావించారని హొసబళే వివరించారు. జాతీయ ఆదర్శాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే స్వాతంత్ర్యం
నిలబడుతుందన్నారు.