అక్కడ వందేమాతరం గీతం ఆలపించకూడదట. జాతీయ పతాకం ఎగురవేయకూడదట. అలాంటి పరిస్థితి నెలకొన్నది ఎక్కడో తెలుసా. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో. ఇటీవల ఒక విద్యార్ధి మృతి కారణంగా వార్తల్లోకెక్కిన ఆ యూనివర్సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి మండిపడ్డారు.
‘‘విశ్వవిద్యాలయంలోని కొందరు విద్యార్థులు నాతో మాట్లాడారు. అక్కడ వందేమాతరం అన్న మాటే ఎత్తకూడదట. మువ్వన్నెల జెండా ఎగరవేయకూడదట. దేశ స్వతంత్ర దినం పంద్రాగస్టు నాడు సైతం పతాకాన్ని ఎగరవేయకుండా ఆంక్షలు విధించారు. విద్యార్ధులు చదువుకునే చోటనే ఇలాంటి జాతి వ్యతిరేక విధానాలు అమలవుతున్న సంగతి, దానికి కారణం అందరికీ తెలుుసు’’ అని సువేందు అధికారి వ్యాఖ్యానించారు.
‘‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే స్వయంగా జాతి వ్యతిరేకి. ఆవిడే యూనివర్సిటీలోని జాతి వ్యతిరేక శక్తులను రక్షిస్తోంది’’ అని సువేందు ఆరోపించారు.‘‘గత పన్నెండేళ్ళుగా అధికారంలో ఉంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. జాదవ్పూర్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలకు, జాతి వ్యతిరేక చర్యలకు మమతా సన్నిహితులే కారణం’’ అంటూ విరుచుకుపడ్డారు.
విశ్వవిద్యాలయంలో విద్యార్ధి మరణం ఘటనపై మమత సర్కారు నలుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఆ కమిటీపైనా సువేందు విమర్శలు గుప్పించారు. ‘‘అదంతా పెద్ద ఫార్స్. విద్యార్ధి మృతి ఘటనతో రాష్ట్రమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఘటనపై భారతీయ జనతా యువమోర్చా ఆందోళన నిర్వహిస్తోంది. ఆ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సిట్ విచారణ జరిపించాలని మా డిమాండ్. ఆ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేయాలి. వారిని అరెస్ట్ చేయాలి. కేసు విచారణ సత్వరం పూర్తిచేసి నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలి. ఆ సమయంలో విశ్వవిద్యాలయంలో విధినిర్వహణలో ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేసారు.
విద్యార్థి స్వర్ణొదీప్ కుందూ మరణానికి కారణమైన ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ యువమోర్చా గురువారం సాయంత్రం ఆందోళన నిర్వహించింది. ఆ కార్యక్రమంలో సువేందు అధికారి పాల్గొన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు