సైబర్ నేరాలు, ఫ్రాడ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు కేంద్ర
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులు విక్రయించే డీలర్లకు పోలీస్
వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. బల్క్ కనెక్షన్లు ఇవ్వడంపైన కూడా ఆంక్షలు
విధించింది.
‘‘కొందరు డీలర్లు
వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే సిమ్‌కార్డులు విక్రయిస్తున్నారు. ఇకపై అలా ఉండదు.
సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నాం. వెరిఫికేషన్ పూర్తయాక
వారు తమ పేరు రిజిస్టర్ చేయించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.10లక్షల జరిమానా విధించనున్నాం’’ అని కేంద్ర
టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం సుమారు 10లక్షల మంది డీలర్లు ఉన్నారని, వెరిఫికేషన్ పూర్తి చేసుకోడానికి వారికి తగిన
సమయం ఇస్తామని మంత్రి తెలిపారు.
మరోవైపు బల్క్
కనెక్షన్ల నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దాని
స్థానంలో బిజినెస్ కనెక్షన్ల పేరిట కొత్త విధానాన్ని తెస్తున్నామన్నారు. ‘‘సైబర్ మోసగాళ్లు
ఈ మధ్య ఒకసారి 5 సిమ్‌లు తీసుకుని, వాటితో నేరాలు
చేస్తున్నారు. కొన్నాళ్ళకు వాటిని డియాక్టివేట్ చేసి మరో 5 సిమ్‌లు కొంటున్నారు. అలాంటి
నేరాలను అరికట్టేందుకే బల్క్ కనెక్షన్ల విధానాన్ని ఆపేస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.
బిజినెస్ కనెక్షన్లకు కూడా వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
గత మూడు నెలల వ్యవధిలో 52 లక్షల మొబైల్ కనెక్షన్లను తొలగించామని మంత్రి చెప్పారు.
67వేల మంది డీలర్లను బ్లాక్ చేశామని, డీలర్లపై 300 ఎఫ్ఐఆర్లు
నమోదు చేసామనీ మంత్రి వెల్లడించారు.