కాంగ్రెస్ మాజీ
నేత, కశ్మీర్‌కు చెందిన నాయకుడు గులామ్ నబీ ఆజాద్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు.
భారతదేశంలో ఉన్న ముస్లిములందరూ గతంలో హిందువులేననీ, మతం మార్చబడిన తర్వాతే
ముస్లిములయ్యారనీ వ్యాఖ్యానించారు.
డెమొక్రటిక్
ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వ్యవస్థాపక నేత గులామ్ నబీ ఆజాద్ దోడా జిల్లా తాత్రీ
ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ హిందూ, ఇస్లాం మతాల
గురించి వ్యాఖ్యలు చేసారు. ‘‘కశ్మీర్ ఉదాహరణే తీసుకోండి. 600 సంవత్సరాల క్రితం
కశ్మీర్లో ముస్లిములు లేరు. కశ్మీరీ పండిట్లను ముస్లిములుగా మతమార్పిడి చేసారు.
ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా అంతే. ఇస్లాం మతం పుట్టి 1500 సంవత్సరాలే
అయింది. హిందూమతం అంతకంటె చాలా పురాతనమైనది’’ అన్నారు.
భారతదేశంలో
ఇస్లాం ప్రవేశం, వ్యాప్తి గురించి కూడా ఆజాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
‘‘భారత్‌లోకి ఇస్లాం బైటనుంచే వచ్చి ఉండాలి. మొగలు సైన్యంలో పదిమందో ఇరవై మందో ముస్లిములు
ఉండేవారు. మిగిలినవారంతా హిందూమతం లేక సిక్కుమతం నుంచి నుంచి మార్చబడిన వారే’’
అన్నారు. గులామ్ నబీ ఆజాద్ ఆగస్ట్ 14న మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
‘‘ఈ గడ్డ హిందువులు,
ముస్లిములు, దళితులు, కశ్మీరీలు అందరిదీ. ఇది మన భూమి. మనమెవ్వరమూ బైటనుంచి
రాలేదు. నేను పార్లమెంటులో చాలా విషయాలు చూసాను. అవి మీవరకూ రావు. మన దేశంలో కొందరు
బైటనుంచి వచ్చినవారని, ఒక సహచర బీజేపీ ఎంపీ అన్నారు. నేను దాన్ని ఖండించాను.
బైటివారా లోపలివారా అన్నది కాదు విషయం. ఇస్లాం వయసు కేవలం 1500 సంవత్సరాలు.
హిందూమతం అంతకంటె చాలా పురాతనమైనది. మొగలుల కాలంలో వారి సైన్యంలో ఉన్న ఓ 10 లేదా
20మంది ముస్లిములు మాత్రం బైటనుంచి భారతదేశానికి వచ్చి ఉంటారు. ఈ దేశంలోని మిగతా
ముస్లిములంతా హిందూమతం నుంచి మార్చబడినవాళ్ళే. కశ్మీరే దానికి పెద్ద ఉదాహరణ’’ అని
గులామ్ నబీ ఆజాద్ వివరించారు.
‘‘మనందరి సమష్టి
వారసత్వానికి మూలాలు హిందూమతంలో ఉన్నాయి. మనని మనం హిందువులుగానో, ముస్లిములుగానో,
రాజపుత్రులుగానో, బ్రాహ్మణులుగానో, దళితులుగానో, కశ్మీరీలుగానో, లేక గుజ్జర్లుగానో
చెప్పుకోవచ్చు. మనందరినీ కలిపి ఉంచే సూత్రం ఒకటుంది. అదే ఈ దేశం. మన పూర్వీకులు ఈ
భూమికి చెందినవారు. మనందరం ఇక్కడికి చేరవలసిన వాళ్ళమే’’ అని ఆజాద్
వ్యాఖ్యానించారు.
‘‘అసలు 600 సంవత్సరాల క్రితం కశ్మీర్లో ముస్లిం
ఎవరున్నారు? అందరూ కశ్మీరీ పండిట్లే. వాళ్ళందరూ ఇస్లాంలోకి మారారు. అందుకే అందరూ హిందూమతంలోనే
పుట్టారు అన్నాను’’ అని చెప్పుకొచ్చారు గులామ్ నబీ ఆజాద్.