సంప్రదాయిక
వైద్య విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ఇవాళ
గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభమైంది. సంస్థ అధిపతి టెడ్రోస్ గెబ్రెవెసస్ తన అధ్యక్షోపన్యాసంలో
భారతీయ ప్రాచీన సంప్రదాయ వైద్య విధానాలపై ప్రశంసలు గుప్పించారు.
‘‘సంప్రదాయిక
వైద్య విధానాల్లో భారతదేశానికి అత్యంత ఆదరణ ఉంది. ఆయుర్వేదం, యోగా వంటివి
సంప్రదాయిక వైద్యంలో భాగాలే. అవి నొప్పిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి’’
అన్నారు టెడ్రోస్. అసంక్రామ్యక వ్యాధుల నివారణలో, మానసిక ఆరోగ్య వికాసంలో, మరిన్ని రోగాల
చికిత్సలో సంప్రదాయిక వైద్య విధానాలకు, మందులకు ప్రపంచమంతా ఆదరణ ఉందని టెడ్రోస్
వివరించారు. మానవాళి ఆరోగ్యాన్ని కాపాడడంలో సంప్రదాయిక వైద్యవిధానాల పాత్ర
ఎనలేనిదన్నారు.
బుధవారమే భారత్
చేరుకున్న టెడ్రోస్, గుజరాత్లో ఒక వెల్నెస్ అండ్ హెల్త్ సెంటర్ను సందర్శించారు.
అక్కడ సుమారు 5వేల మందికి వైద్యసేవలు అందుతున్న పద్ధతి ఆయనను ఆకట్టుకుంది. అక్కడ
వైద్యం చేస్తున్న విధానం, మందులు ఇస్తున్న పద్ధతి, సేవల విస్తరణ తనను ముగ్ధుణ్ణి
చేసాయని టెడ్రోస్ చెప్పారు. అందరికీ ఆరోగ్యం అన్న నినాదం కార్యాచరణలోకి
వచ్చినట్టుందా ప్రదేశం అని ప్రశంసించారు.
ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాల స్థాయిలో సంప్రదాయిక ఆయుర్వేద మందుల వినియోగం బాగా జరుగుతోందని టెడ్రోస్
గమనించారు. సంప్రదాయ వైద్య విధానంలో గొప్పతనం ఏంటంటే ఈ మందులు ప్రకృతి నుంచి
సేకరిస్తారు. మానవుల ఆరోగ్యానికీ, మన చుట్టూ ఉండే ప్రకృతికీ ఉండే సంబంధాన్ని
అవగాహన చేసుకోవడం ఈ వైద్యవిధానం ప్రత్యేకత అని విశ్లేషించారు.
గతేడాది గుజరాత్లోని
జామ్నగర్లో ప్రధాని మోదీతో కలిసి, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ‘గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్
సెంటర్’ను ప్రారంభించారు. అలాంటి కేంద్రాల్లో పరిశోధనల ద్వారా సంప్రదాయిక
వైద్యవిధానాల సమర్థతను ప్రపంచమంతా గుర్తించేలా చేయాలని టెడ్రోస్ సూచించారు.