హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే రెండో సారి వచ్చిన వరదలు తీవ్రమైన ప్రాణ, ఆస్తినష్టం మిగిల్చాయి. గడచిన మూడు రోజుల్లోనే వరదలకు 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు కొండచరియల కింద ఇరుక్కుపోయారు. ఇప్పటి వరకు వచ్చిన వరదలకు తమ రాష్ట్రంలో రూ.7500 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వేందర్సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యాటకుల సర్గదామం సమ్మర్ హిల్స్‌లో వరదలకు కొండచరియలు విరిగిపడి నరకాన్ని తలపిస్తోంది. మూడు రోజుల్లోనే కొండచరియలు విరిగిపడి 13 మంది చనిపోయారు. 21 మంది కనిపించకుండా పోయారు. కొండచరియల కింద చిక్కుకుపోయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. వేలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సిమ్లా జిల్లా సమ్మర్ హిల్స్‌లో ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడటంతో ఓ కుటుంబంలోని మూడు తరాల వారు చనిపోయారని అధికారులు వెల్లడించారు. శివాలయంలో తలదాచుకున్న ముగ్గురు పిల్లలు సహా, ఒకే కుటుంబంలోని మొత్తం ఏడుగురు చనిపోయినట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. వరదల్లో చిక్కుకుపోయిన
వారిని ఒడ్డుకు చేర్చేందుకు భారత వాయుసేన రంగంలోకి దిగింది. ఇప్పటికే కంగ్రా జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన 780 మందిని హెలికాఫ్టర్ల ద్వారా రక్షించారు.
వరదల్లో చిక్కుకుపోయిన వారిని హెలికాఫ్టర్ల ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నట్టు సీఎం సుఖ్వీందర్సింగ్ స్పష్టం చేశారు. వరద బాధితుల కోసం దమ్తల్, షేక్పురాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
గడచిన నాలుగు రోజుల్లో వచ్చిన తాజా వరదలకు 71 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.7500 కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుల సంఖ్య, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.