పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంఫైజలాబాద్
జిల్లా జరన్‌వాలా పట్టణంలో క్రైస్తవులపై దాడి చేసి చర్చిలను తగలబెట్టేసిన సంఘటన
చోటు చేసుకుంది. పట్టణంలోని ఒక క్రైస్తవుడు, అతని సోదరుడు ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ బుధవారం
నాడు వందల మంది ముస్లిములు దాడులకు తెగబడ్డారు. ఐదు చర్చిలకు నిప్పంటించారు.
జరన్‌వాలా పట్టణంలో ఓ ఖురాన్ పుస్తకంలోని
పేజీలు చిరిగిపోయిన స్థితిలో దొరికాయి. ఆ ప్రాంతంలో ఇద్దరు సోదరులు ఉంటున్నారు.
క్రైస్తవులైన వారే ఖురాన్‌ను చింపివేసారని స్థానికులు అనుమానించారు. ఆ వదంతులు
కొద్దిసేపట్లోనే పట్టణమంతా వ్యాపించాయి. తెహరీక్ ఎ లబైక్ పాకిస్తాన్ అనే సంస్థ
సభ్యులు… క్రైస్తవులు ఖురాన్‌ను అవమానించారంటూ అన్ని మసీదుల్లోనూ ప్రచారం
చేసారు. దాంతో స్థానిక ముస్లిములు వందల సంఖ్యలో గుమిగూడారు. క్రైస్తవ సోదరులు అప్పటికే
అక్కణ్ణుంచి పారిపోయారు. ఆ ఇంటిని మూకలు తగలబెట్టేసాయి.
అక్కణ్ణుంచీ విధ్వంసం మొదలైంది.
పట్నంలోని ఐదు చర్చిలపై ముస్లింలు మూకదాడులు చేసారు. చర్చిల్లో చేతికి
దొరికినదాన్ని దొరికినట్టు ధ్వంసం చేసేసారు. చివరగా చర్చిలకు నిప్పు పెట్టేసారు.
అలా ఐదు చర్చిలూ అగ్నికి ఆహుతైపోయాయి.
అక్కడితో విధ్వంసం ఆగలేదు. సమీపంలో
క్రైస్తవులు ఎక్కువగా నివసించే కాలనీలలోకి చొచ్చుకెళ్ళి వారి ఇళ్ళను కూడా
తగలబెట్టేసారు. క్రిస్టియన్ కాలనీలో పదుల సంఖ్యలో ఇళ్ళు కాలి బూడిదైపోయాయి.
విధ్వంసకారులు ఆఖరికి క్రైస్తవుల శ్మశానాన్ని కూడా వదల్లేదు. కొన్ని సమాధులను,
శ్మశానం గోడనీ ధ్వంసం చేసారు.
ఇన్ని అల్లర్లు జరుగుతున్నా పోలీసులు
కఠిన చర్యలు తీసుకోలేదని బాధిత క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేసారు. మైనారిటీలపై దాడులకు దిగేవారినీ, చట్టాన్ని
ఉల్లంఘించేవారిని కఠినంగా శిక్షిస్తామని
పాక్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ హెచ్చరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు