తిరుమలలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం కిందటే కాలినడకన తిరుమలకు వెళుతోన్న భక్తులపై దాడి చేసిన చిరుత, చిన్నారి లక్షితని పొట్టన పెట్టుకుంది. అప్పటి నుంచి అటవీశాఖ అధికారులు వాటిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల కిందట ఓ చిరుత బోనులో చిక్కింది. తాజాగా కాలినడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అడవిలో ఏర్పాటు చేసిన బోనులో ఐదేళ్ల మగ చిరుత చిక్కుకుంది.
కాలినడక మార్గంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులపై చిరుతల దాడి పెరగడంతో అధికారులు సమీప అటవీ ప్రాంతంలో మూడు బోనులు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద అటవీ ప్రాంతంలో బోనులు పెట్టారు. నాలుగురోజుల కిందట బోనులో ఓ చిరుత చిక్కుకోగా, తాజాగా మరో చిరుత బోనులో పడింది. 50 రోజుల వ్యవధిలోనే అటవీ శాఖ సిబ్బంది మూడు చిరుతలను బంధించి జూ పార్కుకు తరలించారు.
తిరుమల కాలినడక మార్గంలో చిరుతల దాడులు పెరగడంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. కాలినడక మార్గంలో తిరుమల చేరుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మధ్యాహ్నం 2 గంటల తరవాత 15 సంవత్సరాలలోపు పిల్లలను అనుమతించకపోవడంతో భక్తుల సంఖ్య తగ్గడానికి దారితీసింది.
చిరుతలను తరిమికొట్టేందుకు కాలినడక మార్గంలో వెళ్లే భక్తుల చేతికి కర్రలు ఇవ్వాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. భక్తుల చేతికి కర్రల నిర్ణయంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. అటవీ శాఖ అధికారుల సూచనల మేరకే చిరుతలను తరిమికొట్టేందుకు భక్తుల చేతికి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు భూమన తెలిపారు. తిరుపతి జూ పార్కు నుంచి చిరుతలను తీసుకువచ్చి తిరుమల అడవిలో వదిలేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. చిరుతలపై నిఘాకు మూడు వందలకుపైగా కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎలుగుబంటిపై నిఘాకు డ్రోన్ కెమెరాలు వాడుతున్నట్టు భూమన వెల్లడించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు