ఉత్తరాది పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. జులైలో వచ్చిన వరదల నుంచి కోలుకోక ముందే మరోసారి తాజాగా వరదలు ముంచెత్తాయి. ఎన్నడూ లేని విధంగా హిమాచల్‌ప్రదేశ్ జలప్రళయాన్ని చవిచూస్తోందని ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజా వరదలకు మూడు రోజుల్లో 61 మంది చనిపోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో వరదలకు రూ.10వేల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని సీఎం తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం అందిస్తోంది.
ఈ సీజీన్లో హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు రెండుసార్లు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో వరదలు, విరిగిపడుతోన్న కొండచరియలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే వరదలు, కొండచరియలు విరిగిపడి వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 61 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాము ఇప్పుడు పర్వతమంత సవాల్‌ను ఎదుర్కొంటున్నట్టు సీఎం అభిప్రాయపడ్డారు. వరదలకు పాడైపోయిన రోడ్లు, తాగునీటి సదుపాయాలను పునరుద్దరించడానికి సంవత్సర కాలం పట్టేలా ఉందని, అయినా ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని చెప్పారు.
ఇప్పటికీ వరదలు కొనసాగుతూ ఉండటంతో బాధితులను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. రెండు నెలల్లో వచ్చిన రెండు వరదలకు ఇప్పటికే 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు రాబోయే నాలుగు రోజులు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.