రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో నాకు పరిచయం
1939లో ఏర్పడింది. అప్పట్లో గ్వాలియర్‌లో ఆర్యసమాజానికి చెందిన యువజన విభాగం
ఆర్యకుమార్ సభ ద్వారా సంఘ్ గురించి తెలిసింది. మాది అత్యంత సనాతన ధర్మాన్ని
ఆచరించే కుటుంబం. కానీ నేను ఆర్యకుమార్ సభ వారం వారం నిర్వహించే సత్సంగానికి
హాజరవుతుండే వాడిని. ఆ సభలో సీనియర్ కార్యకర్త, గొప్ప ఆలోచనాపరుడు అయిన భూదేవ్
శాస్త్రి గారు ఒకసారి మమ్మల్ని ‘‘సాయంత్రం సమయాల్లో మీరేం చేస్తుంటారు’’ అని
అడిగారు. ఆర్యకుమార్ సభ కార్యక్రమాలు ప్రతీ ఆదివారం ఉదయం జరుగుతుండేవి. అందువల్ల
సాయంకాలాలు మేము ఖాళీగానే ఉండేవాళ్ళం. అదే విషయాన్ని ఆయనకు చెప్పాము. అప్పుడాయన
మమ్మల్ని సంఘ శాఖకు వెళ్ళమని సూచించారు. అలా
నేను గ్వాలియర్‌లో శాఖకు వెళ్ళడం మొదలు పెట్టాను. ఆర్ఎస్ఎస్తో అదీ నా మొదటి
అనుబంధం. అవి గ్వాలియర్‌లో శాఖ ప్రారంభమైన తొలిరోజులు. అందులో దాదాపు అందరూ మహారాష్ట్ర
పిల్లలే ఉండేవారు. దాంతో సహజంగా స్వయంసేవకులందరూ మరాఠీ మాట్లాడుతుండేవారు. నేను
శాఖకు క్రమం తప్పకుండా వెళ్ళడం మొదలుపెట్టాను. శాఖలో ఆటలు ఆడుకోవడం, ప్రతీవారం
జరిగే బౌద్ధిక్ సమావేశాలూ నాకు నచ్చాయి.
గ్వాలియర్‌లో శాఖ ప్రారంభించడానికి
నాగపూర్ నుంచి శ్రీ నారాయణరావు తార్తే అనే ప్రచారక్ వచ్చారు. ఆయన చాలా గొప్ప
మనిషి. నిరాడంబరమైన వారు, గొప్ప మేధావి, నిపుణుడైన నిర్వాహకుడు. నేనివాళ ఇలా
ఉన్నానంటే కారణం ఆయనే. ఆ తర్వాత నాకు స్ఫూరి కలిగించినది దీనదయాళ్ ఉపాధ్యాయ,
భావూరావు దేవరస్. అప్పటికి గ్వాలియర్ భావూరావు గారి కార్యక్షేత్ర పరిధిలో లేదు.
కానీ ఒకసారి అప్పటి బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ బాలాసాహెబ్ ఆప్టే గారితో కలిసి శ్రీ
భావూరావు గ్వాలియర్ వచ్చారు. ఆప్టేజీ చాలా మృదువుగా మాట్లాడతారు. మేం చాలా త్వరగా
ఆయన పట్ల ఆకర్షితులమయ్యాము. ఆయనతో నేను కొన్ని క్షణాలు మాత్రమే మాట్లాడాను. కానీ
అదే యేడాది (1940) నేను ఆఫీసర్స్ ట్రయినింగ్ క్యాంప్ (ఓటీసీ) చూడడానికి వెళ్ళినపుడు
ఆయనతో అనుబంధం పెరిగింది. అప్పుడు నేను అక్కడికి శిక్షణ తీసుకోడానికి వెళ్ళలేదు.
ముగింపు వేడుకకు మాత్రం హాజరయ్యాను. అప్పుడే డాక్టర్ హెడ్గేవార్ కూడా అక్కడికి
వచ్చి కొద్దిసేపు ఉన్నారు. ఆయనను నేను చూడడం అదే మొదటిసారి. డాక్టర్జీకి
అనారోగ్యంగా ఉందని తెలిసి చూడడానికి వెళ్ళాను. 1941లో నేను ఉన్నత పాఠశాలలో చదువుకునేటపుడే
నేను ఓటీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసాను. 1942లో ఇంటర్మీడియెట్‌లో ఉండగా ఓటీసీ
రెండో ఏడాది, అలాగే 1944లో బీఏ
చదువుతున్నప్పుడు ఓటీసీ మూడో యేడాదీ పూర్తి చేసాను.
నేను ‘హిందూ తన్ మన్, హిందూ జీవన్’ రాసేనాటికి
నేను పదోతరగతి విద్యార్ధిని. తర్వాత గ్వాలియర్‌లో డిగ్రీ పూర్తిచేసాను. అక్కడ పీజీ
కాలేజీ లేకపోవడంతో, కాన్పూర్ డీఏవీ కళాశాలలో ఎంఏ చేసాను. అప్పట్లో నాకు ప్రభుత్వపు
ఉపకారవేతనం కూడా వచ్చింది. దేశ విభజన కారణంగా నేను ‘లా’ పూర్తి చేయలేకపోయాను. 1947లో
ఇంక పూర్తిస్థాయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేయడం కోసం చదువును వదిలిపెట్టేసాను. 1947
వరకూ నేను చదువుకుంటూనే శాఖ స్థాయిలో సంఘంపని చేసాను. 1942లో నేను క్విట్ ఇండియా
ఉద్యమంలో పాల్గొన్నాను, జైలుశిక్ష కూడా అనుభవించాను. అప్పుడు నేను ఇంటర్మీడియెట్
చదువుతున్నాను. నా వయసు 16 ఏళ్ళు. ఆగ్రా జిల్లాలోని మా స్వగ్రామం భతేశ్వర్లో
నన్ను అరెస్ట్ చేసారు.
మా నాన్నగారికి ఆర్ఎస్ఎస్తో సంబంధం
లేదు, కానీ మా అన్నయ్యకు ఉంది. అతను శాఖకు వెడుతుండేవాడు. ఒకసారి తను శీతాకాలం
క్యాంప్‌కు వెళ్ళాడు. అక్కడ ఓ సమస్య సృష్టించాడు. ‘‘నేను మిగతా స్వయంసేవకులతో
కలిసి ఆహారం తీసుకోలేను, నా వంట నేనే చేసుకుంటాను’’ అని చెప్పాడు. ఆ పరిస్థితిని సంఘం
ఎంత చక్కగా ఎదుర్కొందో చూడండి. క్యాంపు సర్వాధికారి మా అన్నయ్య విజ్ఞప్తిని మన్నించారు, తనకు వంట చేసుకోడానికి
కావలసిన పదార్ధాలన్నీ సమకూర్చారు. మా అన్నయ్య స్నానం, సంధ్యావందనం అన్నీ చేసుకుని
వంట చేసుకున్నాడు. మొదటిరోజు తన ఒక్కడికే వంట చేసుకున్నాడు. ఆ మరునాడు తను ఆ పని
చేయలేకపోయాడు. అందరు స్వయంసేవకులతో పాటు వరుసలో నిలబడి వారు వడ్డించిన ఆహారమే
తిన్నాడు. కేవలం 44 గంటల్లో తను మారిపోయాడు. సంఘం కేవలం వ్యక్తులను మార్చదు. అది
సమష్టి ఆలోచనాధోరణిలో మార్పులు తెస్తుంది. అదే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం పాటించే
నైతిక విలువల సౌందర్యం. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక వ్యక్తి ఎంత ఎత్తుకైనా
ఎదగగలడు. సరైన సాధన చేస్తే స్వీయజ్ఞానం కూడా సాధ్యమే. అంతేకాదు, నిర్వాణ
స్థితిని కూడా పొందవచ్చు. కానీ, సమాజం సంగతేమిటి? ఏ ఒక్కరూ కూడా సాధారణంగా సమాజం
పట్ల తమ బాధ్యత గురించి ఆలోచించరు. దానిగురించి మొట్టమొదటిసారి ఆలోచించినది ఆర్ఎస్ఎస్సే.
వ్యక్తుల్లో పరివర్తన తేవడం ద్వారా సమాజంలో మార్పు తేవచ్చునని సంఘం నిశ్చయించింది.
మా అన్నయ్యను సంఘ క్యాంపులో సర్వాధికారి తిట్టి ఉండవచ్చు, తన ఆధ్యాత్మిక సాధన కోసం
తన వంట తనే చేసుకుంటానన్నప్పుడు దాన్ని అనుమతించకుండా ఉండి ఉండవచ్చు. కానీ ఆయన మా
అన్నయ్యలో కేవలం 44 గంటల్లో పరివర్తన తీసుకువచ్చారు. సంఘం ‘రహస్య విధానం’ అదే. సమాజంలో మార్పు వచ్చేది అలాగే. అది
సుదీర్ఘమైన ప్రక్రియ అన్న మాట నిజమే కానీ, పరివర్తనకు దగ్గరి దారులు ఉండవు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో అస్పృశ్యత
లేకపోవడాన్ని గమనించిన గాంధీజీ సంఘాన్ని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ మాత్రమే
సమాజాన్ని నిర్వహిస్తుంది. మిగతా సంస్థలన్నీ తమదైన ‘ప్రత్యేక ఉనికి’, ‘ప్రత్యేక
ఆసక్తులు’, ‘ప్రత్యేక హోదా’ వంటి అంశాలను గుణాలుగా చెప్పుకుంటాయి. ఆ సోకాల్డ్
అంటరానివారికి వారి ‘ప్రత్యేకత’ను అడుగడుగునా గుర్తుచేస్తూ అంటరానితనాన్ని మరింత
ప్రోత్సహిస్తారు. మీకు సమాజంలో చోటు లేదంటూ తరచు అవమానిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ ముందు రెండంచెల లక్ష్యం ఉంది. మొదటిది
హిందువులను వ్యవస్థీకరించడం. కులాల వంటి కృత్రిమ భేదాలకు అతీతంగా బలమైన హిందూ సమాజాన్ని
నిర్మించడం. కొన్ని తేడాలు ఉంటూనే ఉంటాయి, కానీ వైవిధ్యమే జీవితపు బలిమి కదా. మచ్చుకి,
మనకు భాషా భేదాలున్నాయి. ఆ వైవిధ్యాన్ని ధ్వంసం చేయాలని సంఘం అనుకోదు. ఇక
ఆర్ఎస్ఎస్ రెండో లక్ష్యం హైందవేతరులను, అంటే ముస్లిములు, క్రైస్తవుల వంటివారిని
ప్రధాన స్రవంతిలోకి సమ్మిళితం చేయడం. వారు తమ విశ్వాసానికి తగిన మతాన్ని
అనుసరించవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం పెట్టరు. మనం చెట్లను, జంతువులను, రాళ్ళను,
ఇంకా సృష్టిలో ఉన్న ప్రతీదాన్నీ పూజిస్తాము. భగవంతుణ్ణి ఆరాధించడానికి మనకు వందల
రకాల మార్గాలున్నాయి. ఎవరికి ఏది నచ్చితే ఆ దారిలో వెళ్ళవచ్చు. కానీ ఈ దేశాన్ని
వారు తమ మాతృభూమిగా భావించాలి. ఈ గడ్డ పట్ల దేశభక్తి కలిగి ఉండాలి. అయితే, ఇస్లాం
ఈ ప్రపంచాన్ని దారుల్ హరబ్, దారుల్ ఇస్లామ్ గా విభజిస్తుంది. అది ఈ లక్ష్యానికి
అడ్డుగా నిలుస్తుంది. ముస్లిములు మైనారిటీగా ఉన్న దేశంలో స్థానికులతో కలిసి
జీవించి అభివృద్ధి చెందే కళను ఇస్లాం ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. వాళ్ళు మొత్తం దేశాన్ని
ఇస్లాంలోకి మతాంతరీకరణ చేయలేరు. వాళ్ళు ఈ దేశంలో జీవించాలంటే ఈ వాస్తవాన్ని గుర్తించాలి.
ఇవాళ ముస్లిం దేశాల్లో ఇదో పెద్ద ఎడతెగని ఆలోచన అయిపోయింది. ఈ విషయంలో కురాన్
ఎలాంటి మార్గదర్శనమూ చేయలేదు. అది కేవలం కాఫిర్లను చంపడం, లేదా వారిని ఇస్లాంలోకి
మార్చేయడం గురించి మాత్రమే చెబుతుంది. కానీ వారు ఆ పని ప్రతీసారీ, ప్రతీచోటా
చేయలేరు. తాము తక్కువ సంఖ్యలో ఉన్నచోట వారు అలా ఎలా చేయగలరు? అటువంటి ప్రయత్నమే
కనుక చేస్తే అది పెద్ద గొడవలకి దారి తీస్తుంది. ఆ పరిస్థితిని మార్చుకోవలసింది
ముస్లిములే. మనం వారికోసం మార్చిపెట్టలేం.
ముస్లిముల సమస్యను కాంగ్రెస్ సరిగ్గా
అర్ధం చేసుకోలేదు. వాళ్ళు ముస్లిములను బుజ్జగించే వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నారు.
కానీ దాని ప్రభావమేంటి? ఈ దేశపు ముస్లిములతో మూడు రకాలుగా వ్యవహరించవచ్చు. మొదటిది
‘తిరస్కారం’. వాళ్ళు తమను తాము మార్చుకోకపోతే వారిని విడిచిపెట్టేయడమే. రెండవది
‘పురస్కారం’. అదే సంతుష్టీకరణ లేదా బుజ్జగింపు. అంటే మీరెలాగైనా ప్రవర్తించండి అంటూ
వారికి లంచమివ్వడమే. కాంగ్రెస్, దానిలాంటి ఇతర సంస్థలూ ఇప్పుడు చేస్తున్న పని అదే.
ఇక మూడవ పద్ధతి ‘పరిష్కారం’. వారిలో మార్పు తీసుకురావడం. వారికి సంస్కారాలు
అలవరచి, ప్రధాన జీవన స్రవంతిలో భాగస్వాములను చేయడం. వారికి సరైన సంస్కారాలు
అందించడం ద్వారా వారిలో మార్పు తేవాలని మన భావన. వారి మతం మారదు. వారు తమ సొంత
మతాన్ని అనుసరిస్తూనే ఉండవచ్చు. వారికి మక్కా పవిత్రస్థలంగానే ఉంటుంది. అయితే,
భారతదేశం వారికి పవిత్ర స్థలానికి మించిన పవిత్ర స్థలంగా ఉండాలి. వారు మసీదుకు
వెళ్ళి నమాజు చేయవచ్చు, రోజా ఉండవచ్చు. మాకు ఏ సమస్యా లేదు. కానీ, వారు మక్కా లేదా
ఇస్లాం కానీ భారతదేశం కానీ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటే వారు భారతదేశాన్నే
ఎంచుకోవాలి. దేశంలోని ముస్లిమలందరూ తాము ఈ దేశం కోసమే నివసిస్తాం, మరణిస్తామన్న భావన
వారిలో జాగృతం కావాలి.
నేను పదో తరగతిలో ఉండగా ‘హిందూ తన్ మన్
హిందూ జీవన్’’ అనే గేయం రాసాను. అందులో ‘కోయీ బతలాయే కాబూల్ మే జాకర్ కితనీ
మస్జిదే తోడిన్’… ‘కాబూల్ వెళ్ళి అక్కడ ఎన్ని మసీదులు కూలాయో ఎవరైనా చెప్పండి’
అని రాసాను. నేటికీ నేనా మాటలకు కట్టుబడి ఉన్నాను. కానీ, మనం హిందువులం,
అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణాన్ని కూలగొట్టాం. నిజానికి అది ముస్లిం ఓటుబ్యాంకుకు
ప్రతిస్పందన మాత్రమే. మనం ఆ సమస్యను చర్చలు, చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలనే
కోరుకున్నాం. కానీ చెడుకు ‘పురస్కారం’ ఉండదు. దాన్ని ‘పరిష్కారం’తోనే
మార్చుకోవాలి. ఇప్పుడు హిందూ సమాజం పునరుద్భవించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ప్రధాన లక్ష్యం అదే కదా. హిందువులు గతంలో దురాక్రమణదారుల ముందు తలొగ్గి, వంగి
ఉండేవారు. కానీ ఇంక అలా ఉండబోరు. హిందూసమాజంలో వచ్చిన ఈ మార్పు స్వాగతించదగిన పరిణామం.
హిందువులు స్వీయ అస్తిత్వాన్ని గుర్తించే క్రమంలో వచ్చిన మార్పు ఇది. స్వీయ
సంరక్షణకు చెందిన ప్రశ్న ఇది. హిందూ సమాజం తనను తాను విస్తరించుకోకపోతే, దాని ఉనికే,
దాని మనుగడే ప్రమాదంలో పడుతుంది. మనను మనం విస్తరించుకోవాలి. మనతో పాటు ఇతరులనూ
తీసుకుని నడవాలి. ఇప్పుడు యాదవులు,
హరిజనులని పిలవబడేవారు మనతో వస్తున్నారు. ఆఖరికి మనమంతా హిందువులుగానే జీవించాలి.
ఒకసారి ఒక యాదవ నాయకుడు నా దగ్గరకు వచ్చాడు. ‘‘యాదవులు అందరినీ వ్యతిరేకించకండి. యాదవులందరూ
ములాయంసింగ్, లాలూ ప్రసాద్లతోనే లేరు. ఒక సంస్కరించబడిన యాదవుడు వారిని ఇష్టపడడు.
రాజపుత్రులు, కుర్మీలు, గుజ్జర్లలో ముస్లిములు ఉండవచ్చు. కానీ యాదవ ముస్లిములు
ఎక్కడా లేరు. యాదవులు ఇస్లాంను ఎప్పుడూ ఒప్పుకోలేదు. ముస్లిం యాదవ ఐక్యత–
ఎంవై కార్డ్ – అనేది కేవలం ఓట్ల
కోసం చేసే ఓటి నినాదం మాత్రమే’’ అని చెప్పాడు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో నా సుదీర్ఘ
అనుబంధానికి కారణం చాలా సరళమైనది. సంఘం అంటే నాకు ఇష్టం. దాని సిద్ధాంతాలంటే
నాకు ఇష్టం. అన్నిటికంటె ముఖ్యంగా…
ప్రజల పట్ల సంఘం వైఖరి చాలా ఇష్టం. అది కేవలం సంఘంలో మాత్రమే కనిపిస్తుంది. నేను
లక్నోలో ఉన్నప్పటి ఒక సంఘటన నాకు బాగా గుర్తు. అప్పుడు సోషలిస్టు ఉద్యమం
ఉచ్చస్థితిలో ఉంది. ఒక సీనియర్ కార్యకర్త ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు. తన
ఇంట్లో ఒంటరిగా పడి ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కోడానికి ఎవరూ
వెళ్ళలేదు. ఆ సమయంలో అతని గురించి ఆచార్య నరేంద్రదేవ్‌కి తెలిసింది. ఆయన అతన్ని
చూడడానికి వెళ్ళారు. ‘‘సోషలిస్టు పార్టీలో ఇదేం పద్ధతి? నిన్ను చూడడానికి ఒక్కరైనా
రాలేదు. సంఘంలో అలా ఎప్పటికీ జరగదు. ఎవరైనా స్వయంసేవక్ ఒక్కరోజు శాఖకు వెళ్ళకపోతే,
శాఖలోని మిగతా స్నేహితులు అతనికి ఎలా ఉందో కనుక్కోడానికి అతని ఇంటికి వెంటనే
వెడతారు’’ అని చెప్పారు.
ఎమర్జెన్సీ సమయంలో ఒకసారి నా ఆరోగ్యం బాగోలేదు. నన్ను చూడడానికి నా
కుటుంబ సభ్యులు కూడా రాలేదు. నా దగ్గరకు వస్తే అరెస్ట్ అవుతామని వాళ్ళు భయపడ్డారు.
ఆ సమయంలో నాకు సాయం చేసింది సంఘ కార్యకర్తలే. అదీ సంఘంలో ఉండే మానవీయ సంబంధం. ‘మన’
అనే బంధం. నిజానికి సంఘమే మన కుటుంబం. మనమంతా ఒక్కటే.
మొదట్లో మనం మన పనిని సమాజంలోని అన్ని
వర్గాలలోకీ తీసుకువెళ్ళలేకపోయాం. కారణం మనకు తగినంత మంది కార్యకర్తలు లేకపోవడమే.
మానవ నిర్మాణం ఆరెస్సెస్ మౌలిక లక్ష్యం. ఇప్పుడు మనకు పుష్కలంగా కార్యకర్తలు
ఉన్నందున, మనం సమాజంలోని అన్ని వర్గాల వారినీ చేరగలుగుతున్నాం. అన్ని రంగాలలోనూ
మార్పులు వస్తున్నాయి. కానీ మానవ నిర్మాణ కార్యక్రమం ఆగకూడదు, అది కొనసాగుతుంది, కొనసాగి
తీరాలి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అంటే అదే.