మేకిన్ ఇండియా ఫలాలు క్రమంగా అందుతున్నాయి. దేశీయంగా తయారు చేసిన లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రబల్ ఈ నెల 18న విడుదల కానుంది. కాన్పూర్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ ఆయుధ తయారీ సంస్థ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఈ రివాల్వర్‌ను రూపొందించింది. ఈ రివాల్వర్ 50 మీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధిస్తుంది. దీని బరువు కేవలం 700 గ్రాములు మాత్రమే. స్వీయ రక్షణ కోసం మహిళలు కూడా లైసెన్సు పొంది ఈ గన్ తీసుకెళ్లవచ్చు. లైసెన్స్ తీసుకుని ఎవరైనా ఈ రివాల్వర్ కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ ఏకే మౌర్య ప్రకటించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పునర్నిర్మాణంలో భాగంగా 2021లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఏడాదిలోనే రూ.6 వేల కోట్ల విలువైన ఆయుధాల తయారీ ఆర్డర్లు పొందింది.
అతి తక్కువ బరువు, అందుబాటు ధరలో అందరూ స్వీయ రక్షణకు ఉపయోగించుకునేలా ప్రబల్ రివాల్వర్ తయారు చేశారు. దేశంలో లైసెన్సు తీసుకుని, సామాన్యులు కూడా ఈ గన్ ఉపయోగించుకునే వీలుంది. ప్రైవేటు బ్యాంకులు, వ్యక్తులకు సెక్యూరిటీగా పనిచేసే వారు కూడా ఈ రివాల్వర్ ఉపయోగించుకోవచ్చు. పూర్తిగా దేశీయ సాంకేతికతతో తయారైన ఈ రివాల్వర్‌ను ఆగష్టు 18న విడుదల చేయనున్నారు.