హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. గడచిన మూడు రోజుల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి 60 మంది చనిపోయారు. అతి భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు, కొండచరియలు విరిగిపడి హిమాచల్‌ప్రదేశ్ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. తాజాగా సమ్మర్ హిల్, క్రిష్ణనగర్, ఫగ్లీతో పాటు రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సమ్మర్ హిల్‌లో కొండచరియలు విరిగిపడి అనేక మంది చిక్కుకుపోయారు. విరిగిపడిన కొండచరియల నుంచి 13 మృతదేహాలను వెలికితీశారు. ఫగ్లీ, క్రిష్ణానగర్లో ఐదు మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు.
నిన్న సాయంత్రం సిమ్లాలో కురిసిన కుండపోత వర్షాలకు అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. సోలన్ జిల్లాలో కుండపోత వర్షాలకు ఏడుగురు చనిపోయారు. 800 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు హిమాచల్ సీఎం సుఖ్వీందర్సింగ్ చెప్పారు. వరద బాధితులను హెలికాఫ్టర్ల ద్వారా రక్షిస్తున్న విజువల్స్‌ను సీఎం సోషల్ మీడియాలో షేర్ చేశారు. వరదలకు రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది, సాధ్యమైనంత త్వరగా యుద్ధప్రాతిపదికల పునరుద్దరణ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఆగష్టు 19 వరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
వరదలతో ఇప్పటికే 800 రహదారులు మూసుకుపోయాయని అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ ఏడాది రెండు సార్లు ముంచెత్తిన వరదలకు వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి, తగిన సాయం చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.