మూడు నెలలు హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. స్వతంత్ర
దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణకు
బాహ్యశక్తులే కారణమని మండిపడ్డారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం
కొనసాగుతుందని స్పష్టం చేసారు.
రాజధాని ఇంఫాల్‌లో
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని
ఎగురవేసిన తర్వాత ప్రసంగించారు. ‘‘క్షమించడం, మరచిపోవడం ద్వారా మనం సామరస్యంగా
జీవించగలం, అభివృద్ధిపథంలో పయనం కొనసాగించగలం. గత మూడు నెలలుగా మనం వాటిని
కోల్పోయాం’’ అన్నారు.
‘‘హింస వల్ల ఎలాంటి
అభివృద్ధీ సాగదు. తెగల మధ్య ఏమైనా అనుమానాలు, అపార్థాలు ఉంటే, మనం కలిసి కూర్చుని
మాట్లాడుకుందాం. అన్ని విషయాలనూ చర్చించుకుందాం. దానికి మా తలుపులు ఎప్పుడూ తెరిచే
ఉంటాయి’’ అని చెప్పారు.
భారతదేశంలో
అంతర్భాగంగా, భారత రాజ్యాంగానికి కట్టుబడి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి,
అన్ని తెగలు, జాతుల ఉద్ధరణే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని బీరేన్ సింగ్
స్పష్టం చేసారు. ‘‘శాంతిని ప్రేమించే మన రాష్ట్రాన్ని, మన దేశాన్నీ
అస్థిరపరిచేందుకు కొన్ని బాహ్య శక్తులు, ప్రతీప శక్తులు ప్రయత్నిస్తున్నాయి’’ అని
ముఖ్యమంత్రి మండిపడ్డారు.
రాజ్యాంగానికి
విరుద్ధమైన ఏ పనినీ తమ ప్రభుత్వం చేయలేదనీ, చేయబోదనీ బీరేన్ సింగ్ స్పష్టం చేసారు.
హింసామార్గాన్ని వదిలిపెట్టాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
అదే సమయంలో మాదక ద్రవ్యాలపై తమ పోరాటం కొనసాగుతుందని, అక్రమ వలసదారులపై రాజ్యాంగ సూత్రాలకు
లోబడి చర్యలు తీసుకుంటామనీ స్పష్టం చేసారు.
తమ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తికో,
లేక ఏ ఒక్క తెగకో వ్యతిరేకం కాదని సీఎం చెప్పారు. ప్రజలందరికీ న్యాయం, సమానత్వం
కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.