స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్రాక్టీస్ సందర్భంగా ఆమె మోకాలికి తీవ్ర గాయమైంది. మోకాలి చికిత్స కోసం పలువురు వైద్యులను ఆమె సంప్రదించగా, ఆపరేషన్ తప్ప వేరే పరిష్కారం లేదని చెప్పారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వచ్చే నెలలో చైనాలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదని వినేశ్ పొగాట్ ప్రకటించారు. ఈ నెల 17న ముంబయిలో మోకాలి ఆపరేషన్ చేయించుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
2018లో జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో వినేశ్ పొగాట్ స్వర్ణం సాధించింది. వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడల్లో కూడా దేశానికి స్వర్ణ పతకాన్ని అందించాలని ఎన్నో కలలు
కన్నట్టు వినేశ్ పొగాట్ చెప్పారు. మోకాలి గాయం కారణంగా అలాంటి అదృష్టాన్ని కోల్పోయినట్టు పొగాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాయం కారణంగా ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదని ఆమె అధికారులకు కూడా తెలిపారు. తన స్థానంలో రిజర్వు ఆటగాళ్లను పంపేందుకు వీలుగా ఆమె క్రీడా శాఖ అధికారులకు సమాచారం అందించారు.
స్టార్ రెజ్లర్స్ వినేశ్ పొగాట్, బజ్రంగ్ పునియాలకు ట్రయల్స్ నుంచి మినహాయింపునిచ్చి మరీ ఆసియా క్రీడల్లో నేరుగా పాల్గొనే అవకాశం కల్పించడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై రెజ్లర్లు అంతిమ్ పంగాల్, సుజీత్ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు వీరి పిటీషన్ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా వినేశ్ పొగాట్ ఆసియా క్రీడల నుంచి వైదొలగడంతో, అంతిమ్ పంగాల్కు మార్గం సుగమమైంది.