దేశమంతా 77వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో మునిగిపోతే, హిమాచల్‌ప్రదేశ్ మాత్రం వేడుకలకు దూరంగా ఉంది. అక్కడ గడచిన పది రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తాయి. గడచిన రెండు రోజుల్లోనే హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడి 55 మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల అనేక రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేశాయని, లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులందరికీ సానుభూతిని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులందరినీ ఆదుకుంటాయని మోదీ భరోసా ఇచ్చారు.
వరద మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్సింగ్ తెలిపారు. సోలన్, సిమ్లా, మండి, హమీర్పూర్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయని సీఎం చెప్పారు. ఇప్పటికే వరదలకు 55 మంది చనిపోయారు. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టినట్టు సీఎం స్పష్టం చేశారు. వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పాల్గొంటున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తుచేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు సోలన్ జిల్లాలో ఏడుగురు మరణించగా, సిమ్లాలో శివాలయంపై కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఫాగ్లీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. 17 మందిని రక్షించినట్టు సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.