దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ 10వ సారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరకున్న ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని మోదీ భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇటీవల చోటుచేసుకున్న మణిపూర్ హింసపై ప్రధాని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, త్రివిధదళాల అధిపతులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవాల వేళ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడే ప్రమాదముందనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కోవిడ్ తరవాత భారత్ శక్తి ప్రపంచానికి తెలిసివచ్చిందని ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో గుర్తుచేశారు. మన దేశంలో జీ20 సమావేశాలు నిర్వహించడంతో, మన సామర్ధ్యాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని తెలిపారు. జీ20 సమావేశాలు ప్రపంచానికి కొత్త భారత్‌ను పరిచయం చేశాయని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్, కొత్త ఎగుమతుల లక్ష్యాలను చేరుకుంటోందని ప్రధాని గుర్తుచేశారు. భారత్‌ను విస్మరించడం ఏ దేశం తరం కాదని ఆయన అన్నారు. వేగంగా మారుతోన్న ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోందని, అందుకు తగిన సంస్కరణలు తప్పదన్నారు. బలమైన, స్థిరమైన ప్రభుత్వాలు ఉంటేనే సంస్కరణలు సాధ్యం అవుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
2014లో తాము అధికారంలోకి వచ్చే నాటికి దేశంలో కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయని, కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక అవినీతికి తావులేకుండా చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014లో ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉందని, బలమైన ఆర్థిక విధానాలు అమలు చేయడం, అవినీతిలేని పారదర్శక పాలన అందించడం వల్ల నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో లోపాలను అరికట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అయినట్టు ప్రధాని మోదీ తెలిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు